వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత బిజీగా గడిపే జట్టు టీమిండియానే. ఒక్కో మ్యాచ్ ముగిసిన వెంటనే భారత జట్టు చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది. ఇంత బిజీగా మరే టీం షెడ్యూల్ లేదు. ఇలా షెడ్యూల్ డిజైన్ చేయడంపై టీమిండియా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్టోబర్ 5న గత వరల్డ్ కప్ ఫైనలిస్టులు న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌తో ఈ టోర్నీ మొదలవుతుంది.
ఈ మెగాటోర్నీలో అక్టోబర్ 8న ఆస్ట్రలియాతో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు 3 వేల కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాల్సి రావడం గమనార్హం. ఇంత హెక్టిక్ షెడ్యూల్‌పై కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. భారత జట్టు తమ గ్రూప్ మ్యాచులను తొమ్మిది వేరే వేరే వేదికల్లో ఆడుతుంది. ఈ క్రమంలో టీంకు సరిగా ట్రావెల్ వసతులు కల్పించాలని కపిల్ అన్నాడు.

సరైన వసతులతోపాటు ఛార్టెర్డ్ విమానాలు ఏర్పాటు చేయాలని కపిల్ దేవ్ అన్నాడు. 'భారత జట్టు మొత్తం 11 మ్యాచులు ఆడుతుంది. దీని కోసం వాళ్లు చేయాల్సిన ట్రావెలింగ్ అంతా ఇంతా కాదు' అని చెప్పాడు. 'అసలు ఈ షెడ్యూల్ ఎవరు తయారు చేశారు? మీరు టీంను ధర్మశాలకు పంపుతున్నారు. ఆ తర్వాతి మ్యాచ్ కోసం బెంగళూరు వెళ్లాలి. ఆ తర్వాత కోల్‌కతా.. ఇలా తొమ్మిది వేదికలు తిరగాలి' అని కపిల్ గుర్తుచేశాడు.
అలాగే పదేళ్లపాటు ఐసీసీ ట్రోఫీ నెగ్గలేకపోవడం గురించి ప్రశ్నించగా.. టీం బాగానే ఆడుతుందని, కానీ చివరి మెట్టు మాత్రం ఎక్కలేకపోతోందని అభిప్రాయపడ్డాడు. 'మన టీం ఇంకా బాగానే ఆడుతోంది. ఫైనల్స్, సెమీఫైనల్స్ చేరుతున్నాం కదా' అని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో తలపడుతుంది.