
అందువల్ల నష్టమేమీ లేదు కదా..!
అయితే ఈ విషయమై కపిల్ దేవ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. 'విరాట్ కోహ్లీ లాంటి బిగ్ ప్లేయర్‌ను వదులుకోవాలని నేను చెప్పలేదు. అతను ప్రస్తుతం ఫాంలో లేడు. అతన్ని డ్రాప్ చేస్తున్నట్లు కాకుండా.. అతనికి గౌరవమిచ్చేలా విశ్రాంతినిస్తున్నట్లు సెలెక్షన్ అధికారులు చెప్పితే ఏమవుతుంది. అందువల్ల పెద్ద నష్టమేమీ లేదు కదా' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. గజ్జలో గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో ఆడని కోహ్లీ, లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో తుది జట్టులోకి తిరిగి వచ్చాడు.

అయినప్పటికీ సెలెక్టర్లు తమ నిర్ణయం తీసుకోవచ్చు
ఇంకా కపిల్ దేవ్ మాట్లాడుతూ.. 'విరాట్ లాంటి ఆటగాడిని తిరిగి ఫామ్‌లోకి ఎలా తీసుకురావాలనేది చాలా ముఖ్యమైన విషయం? అతను సాధారణ క్రికెటర్ కాదు. అతను తన ఫామ్‌ను తిరిగి పొందడానికి మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరముంది. మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. టీ20ల్లో కోహ్లీ కంటే గొప్ప ప్లేయర్ ప్రస్తుత తరంలో ఎవరూ లేరని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ సెలక్టర్లు వారి నిర్ణయాన్ని వారు తీసుకోవచ్చు. ఎవరైనా బాగా రాణించకపోతే అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చు లేదా తొలగించవచ్చు అందులో పెద్దగా సంకోచించొద్దు అనేది నా ఆలోచన' అని కపిల్ పేర్కొన్నాడు.

కోహ్లీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది
గత రెండేళ్లుగా ఏ ఫార్మాట్‌లోనూ కోహ్లీ రాణించడం లేదు. నిన్నటి మ్యాచ్‌లోనూ డేవిడ్ విల్లీ వేసిన వైడ్ డెలివరీ బాల్ ఆడి ఔటయ్యాడు. కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా అతను రన్స్ సాధించే మార్గాన్ని వెతకాల్సిన అవసరం ఉందని కపిల్ అభిప్రాయపడ్డాడు. 'ఏదేమైనా కోహ్లీ లాంటి ఆటగాడు మళ్లీ ఫామ్‌లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అతన్ని తీసేశారా.. లేక రెస్ట్ ఇచ్చారా అనేది పెద్ద మ్యాటరేం కాదు. కానీ అతనిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది. అతను దాన్ని వెలికి తీయడానికి మార్గాన్ని వెతుక్కోవాలి. బహుశా రంజీ ట్రోఫీలో ఆడవచ్చు లేదా మరెక్కడైనా ఆడి మంచి లయ అందుకోవచ్చు. అతని కాన్ఫిడెన్స్ తిరిగి రావాలి.

గొప్ప ఆటగాడికి.. మంచి ఆటగాడికి మధ్య తేడా ఏంటంటే..
'ఇది గొప్ప ఆటగాడికి, మంచి ఆటగాడికి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. అతనిలాంటి గొప్ప ఆటగాడు తిరిగి ఫాంలోకి రావడానికి ఎక్కువ సమయం తీసుకోడు. తనతో తానే పోరాడి అన్నింటినీ చక్కదిద్దుకోవాలి. అతను మళ్లీ ఫామ్‌లోకి రావడానికి చాలా సమయం తీసుకుంటున్నాడనేది కాస్త ఆందోళన కలిగిస్తుంది. ఒక గొప్ప ఆటగాడికి ఇంత సమయం పట్టదు. ఒక్క ఇన్నింగ్స్ అతని లయను మార్చగలదు కానీ అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దాని కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాం' అని కపిల్ దేవ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications
