హైదరాబాద్: 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను తొలిసారి గెలుచుకుంది. అయితే ఆ వరల్డ్ కప్‌ను సాధించడంలో అప్పటి కెప్టెన్ తమపై ఉంచిన నమ్మకమేనని అంటున్నారు కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, రోజర్ బిన్నీలు.
34 ఏళ్ల క్రితం టీమిండియా సాధించిన ఈ అద్భుత విజయంలో ఈ ముగ్గురు జట్టు సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో అదివారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఈ ముగ్గురూ అప్పటి జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు.
'ఫైనల్ మ్యాచ్‌కు ముందు కపిల్ దేవ్ ఇచ్చిన ప్రసంగం మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మమ్మల్ని ఎంతో ఎత్తులో చూసుకునే స్పీచ్ అది. ఆ ప్రసంగంతో మాలో విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఆ క్రమంలోనే మేము ఫైనల్ పోరులో విజయం సాధించాం' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు.
అప్పటికే వరల్డ్ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వెస్టిండిస్ లాంటి జట్టును ఎదుర్కొనడంలో కపిల్ స్పీచే కారణమని శ్రీకాంత్ పేర్కొన్నాడు. వెస్టిండిస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 38 పరుగులు చేసి భారత గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

ఇక రోజర్ బిన్నీ మాట్లాడుతూ అప్పటి వరల్డ్ కప్‌లో జింబాబ్వేతో జరిగిన సెమీ ఫైనల్లో 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో కపిల్ దేవ్ ఆడిన తీరు అద్భుతమని అన్నాడు.
'ఆ మ్యాచ్‌లో కపిల్ దేవ్ ముఖ్య భూమిక పోషించాడు. అజేయంగా 175 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో కపిల్ బాధ్యతాయుతంగా ఆడి గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించాడు. అదొక స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు' అని బిన్నీ తెలిపాడు.
కాగా ఆనాటి వరల్డ్ కప్‌లో 18 వికెట్లు తీసుకున్న రోజర్ బిన్నీ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు కపిల్ దేవ్ చెప్పిన కొన్ని పదాలే తమలో నమ్మకానికి కారణ మయ్యాయని కిర్మాణీ పేర్కొన్నాడు. ఆ నమ్మకమే వెస్టిండీస్‌ను ఫైనల్ ఓడించి భారత్‌కు తొలిసారి వరల్డ్ కప్ సాధించడానికి దోహద పడిందని కిర్మాణీ చెప్పాడు.