England vs India: అలా చేస్తే.. ఆ భారత ఆటగాళ్లను అవమానించినట్లే: కపిల్ దేవ్

ముంబై: ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సేవలను కోహ్లీసేన కోల్పోయింది. గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. గాయం కారణంగా అతడు 6 నుంచి 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. దాంతో అతను ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో యువ ఓపెనర్ పృథ్వీ షాకు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఉన్న అతడిని ఇంగ్లండ్‌కు పంపించాలని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు.

ఎవరినీ పంపాల్సిన అవసరం లేదు:
తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్.. ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో కొత్తగా ఎవరినీ చేర్చొద్దని సూచించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న 20 మందితో ఐదు టెస్టుల సిరీస్‌ను విజయవంతంగా ముగించవచ్చన్నారు. ఇప్పటికే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ స్థానానికి పోటీలో ఉన్నారని.. గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానంలో మరో ఆటగాడిని కావాలంటూ భారత్ కోరడం సరైనది కాదన్నారు. 'ఇప్పుడు కొత్తగా జట్టులోకి ఎవరినీ పంపాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు కూడా కాస్త బాధ్యతగా ఉండాలి. వాళ్లొక జట్టును ఎంపిక చేశారు. అప్పుడు కెప్టెన్, కోచ్‌లను సంప్రదించకుండా చేయరనే అనుకుంటున్నా' అని కపిల్ అన్నారు.

అలా జరగకపోతే వారిని అవమానించినట్లే:
'టెస్టుల్లో ఓపెనింగ్ చేయడానికి ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు ఉన్నారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అక్కడే ఉన్నారు. అలాంటప్పుడు మూడో ఆటగాడు అవసరమని నేను భావించను. ఇప్పుడు కొత్తగా మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోవడాన్ని సమ్మతించలేను. ఇప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. కాబట్టి వాళ్లనే ఆడించాలి. అలా జరగకపోతే వారిని అవమానించినట్లే అవుతుంది' అని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నారు. రోహిత్ శర్మతో కలిసి రాహుల్ లేదా మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

8 టెస్టుల్లో 414 రన్స్:
గతేడాది ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్.. ఈ ఏడాది ఆరంభలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జోరు కనబర్చాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్ 2021లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 7 మ్యాచ్‌ల్లో కేవలం 132 పరుగులే చేశాడు. ఆపై డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లోనూ నిరాశపరిచాడు. గిల్ ఇప్పటి వరకు 8 టెస్టులు ఆడాడు. 31.84 సగటుతో అతను 414 రన్స్ చేశాడు. అతని కెరీర్‌లో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

800లకు పైగా పరుగులు:
ఇక పృథ్వీ షా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ఈనెల 13 నుంచి జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో ఆడనున్నాడు. గతేడాది న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో విఫలమైన షాను భారత్ పక్కనపెట్టింది. దీంతో తన బ్యాటింగ్‌శైలిని సరిదిద్దుకొని దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో 800లకు పైగా పరుగులు చేశాడు. ఆపై ఐపీఎల్ 2021లోనూ తన మార్క్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే లంక పర్యటనకు వెళ్లాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications