
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియ్సమన్ నడుస్తున్నాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో తల్లి కాబోతున్న సందర్భంగా అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలి టెస్టు తర్వాత వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. అదే కారణంతో విలియమ్సన్ వెస్టిండీస్‌తో ఆడాల్సిన రెండో టెస్టుకు దూరం అయ్యాడు. విలియమ్సన్ దూరమవుతున్నాడని కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ గురువారం ఒక వీడియోలో పేర్కొన్నాడు. న్యూజిలాండ్ జట్టు ట్విటర్‌లో దాన్ని విడుదల చేసింది.
కేన్ విలియమ్సన్ సతీమణి సారా రహీమ్ కొద్దిరోజుల్లో తొలిసారి మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుందని, ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 11) నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టులో అతడు ఆడటం లేదని కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. విలియమ్సన్ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నాడని, అతడి స్థానంలో ఇటీవలే అరంగేట్రం చేసిన విల్ యంగ్ ఆడతాడని చెప్పాడు. ఇక జట్టు బాధ్యతలు టామ్ లాథమ్‌కు అప్పగించినట్లు వివరించాడు.
గతవారం జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 134 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (251; 412 బంతుల్లో 34x4, 2x6) డబుల్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ 519/7 స్కోర్ సాధించింది. అనంతరం విండీస్ 138, 247 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ సారథి టెస్టుల్లో విరాట్ కోహ్లీ సరసన చేరాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. కోహ్లీ, విలియమ్సన్ 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.
ఈరోజు ప్రారంభం అయిన రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ ఆడట్లేదు. అతని స్థానంలో విల్ యంగ్ ఆడుతున్నాడు. ఈ టెస్టులో యంగ్ రాణించాడు. 87 బంతుల్లో 43 రన్స్ చేశాడు. నాలుగు బౌండరీలు బాదాడు. మొదటి రోజు ముగిసేసరికి కివీస్ 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేశాడు. హెన్రీ నికోల్స సెంచరీ చేశాడు. వాల్టింగ్ (30), మిచెల్ (42) రాణించారు. గాబ్రియేల్ 3 వికెట్లతో రాణించాడు. హోల్డర్ 2, జోసెఫ్ 1 వికెట్ తీశారు.