ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. న్యూజిల్యాండ్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మిగతా లీగ్ మొత్తానికి అతను దూరమయ్యాడు. అంతేకాదు, కివీస్ తరఫున కూడా ఆడలేకపోయాడు. ఈ క్రమంలో ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా అతను ఆడటం అనుమానమే అన్నారు.
విలియమ్సన్ ఆడకపోతే.. అది కివీస్‌కు వరల్డ్ కప్‌లో చాలా పెద్ద లోటే. ఇటీవలే ఇంగ్లండ్‌లో ఆడుతూ మరో కివీస్ స్టార్ మైకేల్ బ్రేస్‌వెల్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతను వరల్డ్ కప్ ఆడటం లేదని తేలిపోయింది. ఇక కేన్ మామ కూడా లేకపోతే కివీస్ కనీసం పోటీలో కూడా ఉండలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో అభిమానులకు కేన్ మామ గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు.

ఆరంభం నుంచే తను బాగా కోలుకుంటున్నానని కేన్ మామ చెప్తూనే ఉన్నాడు. తాజాగా అతను షేర్ చేసిన వీడియోలో దాదాపు పూర్తిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన కుమార్తెతో క్రికెట్ ఆడుతూ కనిపించాడీ కివీస్ స్టార్. ఈ వీడియో చూసిన అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. కేన్ మామ లేకపోతే కివీస్ మ్యాచులు చూడటం చాలా కష్టంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన అభిమానులు కొందరు.. 'గాయం తర్వాత కేన్ మామ ఆడుతున్న తొలి మ్యాచ్' అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదేమైనా విలియమ్సన్ ఈ వన్డే వరల్డ్ కప్ నాటికి పూర్తిగా కోలుకొని మైదానంలో దిగేలా కనిపించడం మాత్రం అతని అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తోంది. అయితే అతని రికవరీపై కివీస్ క్రికెట్ బోర్డు నుంచి కానీ, స్వయంగా కేన్ నుంచి కానీ ఎలాంటి ప్రకటనా ఇంకా రాలేదు.