
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం హైదరాబాద్-బెంగళూరు జట్లు తలపడ్డాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డు సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 39 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్ 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. కాగా విలియమ్సన్ తర్వాత ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
సూర్య కుమార్ యాదవ్, అయ్యర్‌లు ఇద్దరూ ఈ సీజన్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో బెంగళూరుకు 147 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.