
కరాచీ: 2006లో పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటన అది. టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు 'డ్రా' అయ్యాయి. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఏ జట్టు గెలువలేకపోయింది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించడం లేదని పిచ్‌లపై రెండు జట్లు అసంతృప్తిగానే ఉన్నాయి. అయితే కరాచీలో జరిగిన మూడో టెస్టు తొలి ఓవర్‌తోనే సీన్ మారిపోయింది. యువ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఏకంగా హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసఫ్ టాప్ బ్యాట్స్‌మన్‌ల వికెట్లు పడగొట్టాడు.
కరాచీ టెస్టులో ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 341 పరుగుల భారీ తేడాతో ఒడి సిరీస్‌ను 0-1తేడాతో కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 39 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో యువ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ జట్టులో అప్పుడు కొత్తగా అడుగుపెట్టిన అక్మల్‌పై ఎటువంటి ఒత్తిడి లేకపోవడంతో శతకం నమోదు చేశాడు. అయితే తాను సెంచరీ చేయడానికి మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ ఇచ్చిన సలహానే కారణమని అక్మల్ చెప్పాడు.
తాజాగా కమ్రాన్ అక్మల్ తన యూట్యూబ్ చాట్ షో క్రిక్ కాస్ట్‌లో పాకిస్తాన్ జర్నలిస్ట్ సావేరా పాషాతో మాట్లాడుతూ 2006 కరాచీ టెస్టు మ్యాచ్ విశేషాల్ని గుర్తు చేసుకున్నాడు. 'ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించి పాక్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. నేను కూడా అప్పుడే కొత్తగా జట్టులోకి వచ్చా. దాంతో నాపై పెద్దగా ఒత్తిడి లేదు. ఆ మ్యాచ్‌కు ఇంజీ భాయ్ వెన్నుగాయంతో దూరమయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇంజీ ఒక్కటే చెప్పాడు. ఇప్పటికే జరిగిన నష్టం చాలా పెద్దది. ఇంతకంటే అధ్వానం ఏమీ ఉండదు. నువ్వు మాత్రం ఎటువంటి ఒత్తిడి తీసుకోవద్దు. నీ సహజసిద్ధమైన ఆటనే ప్రదర్శించు. భారత్‌పై ఎలా ఆడతావో అలానే ఆడు. ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకో. కేవలం నీ నేచురల్ గేమ్‌ను మాత్రమే ఆడు. ఏదీ జరిగినా పర్వాలేదు' అని తనలో ప్రేరణ నింపినట్లు కమ్రాన్ తెలిపాడు.
'ఇంజీ భాయ్ ఇచ్చిన ప్రేరణతోనే తొలి ఇన్నింగ్స్‌లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పా. ఈ క్రమంలోనే సెంచరీ సాధించి పాక్‌ను పటిష్ట స్థితిలో నిలిపాను. అదే మా విజయానికి బాటలు వేసింది. ఆ టెస్ట్ నా కెరీర్‌లోనే అత్యుత్తమ మ్యాచ్' అని కమ్రాన్ పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అక్మల్ ఇప్పటివరకు 53 టెస్టుల్లో, 157 వన్డేల్లో, 58 టీ20 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 11 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు చేశాడు.
కరాచీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 245 పరుగులకు ఆలౌట్ కాగా.. కమ్రాన్ అక్మల్ 113 పరుగులు చేశాడు. ఆపై మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 238 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 599/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో భారత్‌కు 607 పరుగుల టార్గెట్‌ను పాక్ నిర్దేశించగా.. 265 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఫలితంగా పాక్ 341 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.