Kamran Akmal: కొన్ని విషయాలు కాలంతో మారవు అంటారు. దానికి ఉదాహరణగా పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వికెట్ కీపింగ్‌ను చెప్పవచ్చు. సుమారు 15 సంవత్సరాల క్రితం కమ్రాన్ అక్మల్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన వికెట్ కీపర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న మాజీ ఆటగాళ్ల వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో కమ్రాన్ అక్మల్ చేసిన ఒక పని, అభిమానులను మళ్లీ 2010ల నాటికి తీసుకెళ్లింది. అప్పుడు, ఇప్పుడు ఒకే విధంగా కమ్రాన్ అక్మల్ చేసిన పొరపాట్లను పోల్చి అతడిని ఆటపట్టిస్తున్నారు.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసిన 'గోల్డెన్' క్షణం
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు వికెట్ కీపర్‌గా కమ్రాన్ అక్మల్ బరిలోకి దిగినప్పుడు అభిమానులు అతను పొరపాటు చేస్తాడని ఎదురుచూశారు. వారిని అక్మల్ నిరాశపరచలేదు.ఇంగ్లాండ్ జట్టు 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు.. ఆటలోని ఆరో ఓవర్‌ను స్పిన్నర్ షోయబ్ మాలిక్ వేశాడు. అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు బిల్ మస్టర్డ్ క్రీజు వదిలి బంతిని బాదడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతన్ని ఏమార్చి, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ చేతుల్లోకి చేరింది.

బిల్ మస్టర్డ్ క్రీజు వదిలి బయటకు రావడంతో కమ్రాన్ అక్మల్‌కు సులువుగా స్టంపింగ్ చేసి అవకాశం వచ్చింది. కానీ అక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది. చేతికి వచ్చిన బంతిని లడ్డులా పట్టుకుని స్టంపింగ్ చేయకుండా కళ్లు మూసి ఆట ఆడాడు కమ్రాన్ అక్మల్. బంతి కమ్రాన్ అక్మల్ గ్లవ్స్‌కు తగిలి జారిపోవడంతో, మస్టర్డ్ నెమ్మదిగా క్రీజులోకి తిరిగి వచ్చాడు. ఈ పొరపాటు, అక్మల్ తన ఆట రోజుల్లో చేసిన అనేక పొరపాట్లను అభిమానులకు గుర్తు చేసింది.
ఆటపట్టించిన ఫ్యాన్స్
ఈ సంఘటనను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తించారు. ఒక అభిమాని, "2010ల జ్ఞాపకాలను తిరిగి మాకు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు కామి భాయ్" అని పోస్ట్ చేశాడు. మరొకరు "ఇది చూస్తుంటే నాకు 14 ఏళ్లు వెనక్కి వచ్చినట్లు అనిపిస్తుంది, కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు" అని కమ్రాన్ అక్మల్‌ను ఆటపట్టించారు. ఇంటర్నెట్‌లో మీమ్ క్రియేటర్లకు ఇది ఒక పెద్ద విందుగా మారింది.
తప్పించుకున్న పాకిస్తాన్
కమ్రాన్ అక్మల్ చేసిన ఈ సాయం వల్ల రెండో అవకాశం పొందిన బిల్ మస్టర్డ్, దానిని బాగా ఉపయోగించుకుని అర్ధ సెంచరీ సాధించి, మొత్తం 58 పరుగులు చేసి పాకిస్థాన్ జట్టుకు ఒత్తిడిని పెంచాడు. అయినప్పటికీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ అద్భుతమైన అర్ధ సెంచరీ, ఇతర బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ పాకిస్తాన్ జట్టును కాపాడాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, కమ్రాన్ అక్మల్ తన వంతుగా అభిమానులకు ఒక 'టైమ్ మెషీన్' ప్రయాణం ఇచ్చి, పాత జ్ఞాపకాలను రేపి, కడుపుబ్బా నవ్వించాడు. కమ్రాన్ భాయ్, మీరు నిజంగా మారనే లేదు!