
నేనెందుకు జట్టులోకి రాకూడదు:
'ఇన్‌సైడ్ ఔట్' షోలో తాజాగా కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ... 'నేను గత ఐదేళ్లలో దేశీయ క్రికెట్ మరియు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నా. అయినప్పటికీ పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి నాకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో ఓ ఇద్దరు కోచ్‌లు నన్ను ఇష్టపడడం లేదు. నన్ను టెస్ట్, టీ20 జట్టు నుండి దూరంగా ఉంచడం అన్యాయం. ఎందుకంటే నేను పూర్తి బ్యాట్స్‌మన్‌గా ఆడగలను. 18-20 సగటుతో మాథ్యూ వేడ్ తిరిగి జట్టులోకి రాగా.. దాదాపు 60 సగటు ఉన్న నేనెందుకు రాకూడదు' అని ప్రశ్నించాడు.

ఆఫ్ ఫీల్డ్ కార్యకలాపాలు కొత్తేమీ కాదు:
తన సోదరుడు ఉమర్ అక్మల్ సస్పెన్షన్‌కు జట్టు యాజమాన్యమే కారణం అని కమ్రాన్ అక్మల్ అన్నాడు. పాకిస్తాన్ క్రికెట్లో ఆఫ్ ఫీల్డ్ కార్యకలాపాలు కొత్తేమీ కాదన్నాడు. ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో జట్టు యాజమాన్యం మరియు కెప్టెన్ తెలుసుకోవాలన్నాడు. 'షోయబ్ అక్తర్, మొహమ్మద్ ఆసిఫ్ మరియు షాహిద్ అఫ్రిదిల పట్ల ఇంజి భాయ్ (ఇంజామామ్-ఉల్-హక్) ఎలా వ్యవహరించాడో చెప్పక్కర్లేదు. ఉమర్ అక్మల్ పట్ల కూడా అలా ఉంటే.. విషయం భిన్నంగా ఉండేది' అని అక్మల్ పేర్కొన్నాడు. అక్మల్ పాక్ తరఫున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 11 సెంచరీలు బాదాడు.

భారత్‌కి వెళ్లి ఆడాలా?:
గత జనవరిలో బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు తనని ఎంపిక చేయకపోవడంపై కూడా 38 ఏళ్ల అక్మల్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై అసహనం వ్యక్తం చేసాడు. 'చాలా భాదగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడంలేదు. నేను నమ్మకాన్ని కోల్పోను. అయితే దేనికైనా పరిమితి ఉంటుంది. పీసీబీలో కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఐదేళ్లు అయింది. అత్యుత్తమ నైపుణ్యం, నిలకడగా రాణించే ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికవుతారు. అయితే నన్ను పక్కనపెట్టారు. నేను జాతీయ జట్టులో ఆడాలంటే భారత్‌కి వెళ్లి ఆడాలా? లేదా ఆస్ట్రేలియాకు వెళ్లాలా?' అని కమ్రాన్ అక్మల్ పీసీబీని ప్రశ్నించాడు.

ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి చెప్పాలా?:
'నేను పాక్ ఆటగాడిని, గత ఐదేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా. ఇంకెంత కాలం ఓపిక పట్టాలి? ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి ఈ ఐదేళ్లలో ఎలా ఆడానని చెప్పాలా?. మంచి ప్రదర్శన చేసేవాళ్లని జట్టులోకి ఎంపిక చేసినా నాకు ఎలాంటి బాధలేదు. టీ20 జట్టులో అవకాశం ఉన్నా ఇతరులను బలవంతంగా ఆడిస్తున్నారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అవకాశం ఇవ్వండి. పీఎస్‌ఎల్, దేశవాళీలోని అన్ని ఫార్మాట్లలో బాగా రాణిస్తున్నా. కోచ్-సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ ఈ విషయాలను పట్టించుకోవాలి' అని అక్మల్ అన్నాడు.


Click it and Unblock the Notifications












