
సిడ్నీ: స‌్వదేశంలో భారత్ చేతిలో టెస్టు సిరీస్ ఓటమి తన కోచింగ్ కెరీర్‌కు మేలుకొలుపు లాంటిదని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. 2018-19లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత్ 2-1తో సొంతం చేసుకుంది. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీసేన సరికొత్త చరిత్ర నెలకొల్పింది. అయితే ఆసీస్ స్వదేశంలో సిరీస్ ఓడిపోవడం తనకు ఒక పెద్ద గుణపాఠమని అంటున్నాడు జస్టిన్ లాంగర్.
శనివారం ఓ మీడియా సంస్థతో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ తన కోచింగ్ కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు. 'భారత్ చేతిలో సిరీస్ ఓటమి నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం. సొంతగడ్డపై పరాజయం కోచింగ్ కెరీర్‌లో నాకో మేలుకొలుపు లాంటిది. ఇంకో పదేళ్ల తర్వాత ఒక్కసారిగా వెనుతిరిగి చూసుకుంటే నా కెరీర్ ఎలా మొదలైందో చూసుకోవచ్చు. దీనికి తోడు 2001లో నన్ను జట్టు నుంచి తప్పించారు. 31 ఏళ్ల వయసులో ఇక నా పని అయిపోయిందనుకున్నా' అని లాంగర్ తెలిపాడు.
'క్లిష్టమైన పరిస్థితులే జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలో నేర్పిస్తాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ సమస్యను తీసుకుంటే.. ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. మనం పాఠాలు నేర్చుకుని ఎలా గాడిన పడాలనేది గుర్తిస్తే అద్భుతమైన వ్యక్తిగా మారేందుకు అవకాశం లభిస్తుంది' అని లాంగర్ అన్నాడు. లాంగర్ ఆసీస్ తరుఫున 105 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు.
2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఓపెనర్ డేవిడ్ వార్నర్, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లు ఏడాది పాటు నిషేధానికి గురి కాగా.. బాన్‌క్రాఫ్ట్ కూడా 9 నెలల నిషేధం పడింది. అదే సమయలో జస్టిన్ లాంగర్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అప్పటివరకూ డారెన్ లీమన్ కోచ్‌గా ఉండగా.. ఆ స్థానంలో లాంగర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పచెప్పారు. అయితే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆసీస్ సొంత గడ్డపై కోల్పోయింది.