మీర్పూర్: ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది.. ఏంటీ ఇంత కసిగా ఆడాడు అని. ఎందుకంటే బ్యాటింగ్ వచ్చేందుకు సురేష్ రైనా, యువరాజ్ సింగ్‌లు సిద్ధంగా ఉన్నప్పటికీ శిఖర్ ధావన్ ఔటవగానే ధోనీ ప్యాడ్లు కట్టుకుని మైదానంలో అడుగుపెట్టాడు.
ఎంతో ఉత్కంఠగా సాగుతున్న మ్యాచును ఒక్కసారిగా టీమిండియా వైపు తిప్పేశాడు. అంతేగాక, 6 బంతుల్లోనే 20 పరుగులు చేసి భారత్‌కు ఒక ఓవర్ ఉండగానే ఆసియా కప్‌ను అందించాడు. ధోనీ చేసిన పరుగుల్లో రెండు భారీ సిక్సర్లు ఉండటం విశేషం. ఫైనల్ మ్యాచుల్లో ఎప్పుడూ దూకుడుగా ఆడే ధోనీ.. ఈ ఫైనల్ మ్యాచులో మాత్రం బంగ్లాదేశ్‌తో కసిగా ఆడాడు.
Photos: Asia Cup T20 2016
మ్యాచ్ అనంతరం ధోనీ ఆట గురించి టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఆసక్తికరమైన వివరణ ఇచ్చాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగే ప్రజంటేషన్ సెర్మనీలో హర్షా భోగ్లే అడిగినప్పుడు రవిశాస్త్రి చెప్పిన విషయం చాలామంది టీమిండియా అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

'గతంలో బంగ్లాదేశ్ జట్టు సిరీస్ గెలిచినప్పుడు వాళ్లు చేసుకున్న సంబరాలను మాత్రం గుర్తుంచుకోవాలని తెలిపాను. ఇప్పుడు వెళ్లి, చితక్కొట్టాలని సూచించాను' అని రవిశాస్త్రి అన్నాడు. ఆ కసి మొత్తం ధోనీ బ్యాటింగ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది.
అంతేకాదు.. బంగ్లాదేశ్ వీరాభిమాని ఒకరు అత్యుత్సాహంతో బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్... టీమిండియా కెప్టెన్ ధోనీ తల పట్టుకుని వెళ్తున్నట్లు ఓ మార్ఫింగ్ ఫొటోను రూపొందించి, దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో అప్పటికే ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గతంలో కూడా టీమిండియా ఆటగాళ్లను అరగుండుతో చిత్రీకరించిన పైత్యం బంగ్లా అభిమానులది. వారి అత్యుత్సాహానికి భారత్ సరైన సమాధానం ఇచ్చింది.

విజయానికి 121 పరుగులు చేయాల్సిన టీమిండియా.. చివర్లో 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకు వీరవిహారం చేసిన శిఖర్ ధవన్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో విరాట్ కోహ్లీ.. అప్పటికే కుదురుకున్నా, భారీషాట్లు మాత్రం రావడం లేదు. అప్పటికే యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హార్దిక్ పాండ్యా ముగ్గురూ ప్యాడ్లు కట్టుకుని, బ్యాట్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు.
బంగ్లా మాత్రం అభిమానులు గోళ్లు కొరుక్కుంటూ కొందరు, దేవుడికి ప్రార్థనలు చేస్తూ మరికొందరు కనిపించారు. ఇంతలో కెమెరాలు క్రీజ్ వైపు తిరిగాయి. అక్కడ బ్యాటింగ్ ఎండ్‌లో చూస్తే.. ధోనీ! అంతా ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఏడో స్థానంలో వచ్చే ధోనీ.. ఏకంగా నాలుగో స్థానానికి రావడం ఏంటనుకున్నారు. అయితే, ఎందుకు వచ్చాడో పది నిమిషాల తర్వాత స్పష్టమైంది.

ఎంతో ఉత్కంఠగా సాగుతున్న మ్యాచును రావడంతోనే టీమిండియా వైపు తిప్పేశాడు ధోనీ. 14వ ఓవర్ తొలిబంతిని 105 మీటర్ల దూరానికి సిక్సర్ కొట్టాడు. ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. అక్కడక్కడ పల్చగా ఉన్న భారత అభిమానులు మాత్రం జెండాలు ఎగరేస్తూ కేకలు వేశారు.
అదే ఓవర్‌లో మరో ఫోర్, ఇంకో సిక్సర్.. అంతే, ఆసియా కప్ భారత్‌కు వచ్చేసింది. కాగా, 'చిన్నపిల్లలు నిప్పుతో ఆటలు ఆడుకోకూడదని, అలా ఆడుకుంటే చేతులు కాలక తప్పదు'అని భారత అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించడం ఆకట్టుకుంది.