న్యూఢిల్లీ: ఫామ్‌తో బాధపడుతున్న ముగ్గురు భారత ఫాస్ట్ బౌలర్లకు భారత జట్టు మాజీ సీమర్, బౌలింగ్ కోచ్ వెంకటేష్ ప్రసాద్ కొన్ని చిట్కాలు చెప్పారు. ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీలకు ఆయన బౌలింగ్‌లో చూపాల్సిన మెలుకువలను చెప్పారు. ప్రపంచ కప్ పోటీల్లో ఎక్కువ వైవిధ్యాన్ని ప్రదర్శించకుండా స్టంప్‌లకు గురి పెట్టి బౌలింగ్ చేయాలని ఆయన వారికి చెప్పారు.
ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో భారత్ తన తొలి మ్యాచులో ఫిబ్రవరి 14వ తేదీన దాయాది జట్టు పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది. స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేయాలని వెంకటేష్ ప్రసాద్ చెప్పాడు. అసాధారణత కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని అన్నాడు. పొట్టి క్రికెట్‌లో టైట్ బౌలింగ్ చేయాలని, స్టంప్‌లకు దూరంగా బంతి వెళ్లేలా బౌలింగ్ చేయకూడదని ఆయన అన్నారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు.

జట్టు ఫామ్‌పై కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. జట్టు సభ్యులకు రెండు వారాల గ్యాప్ వచ్చిందని, ఆస్ట్రేలియా పర్యటన అనుభవంతో తప్పులను సరిదిద్దుకోవాలని, ఇప్పటి వరకు అంత బాగా రాణించలేదు గానీ ప్రపంచ కప్ పోటీలు కొత్త ప్రారంభమని ఆయన అన్నారు.
పాకిస్తాన్‌తో జరిగే ఒక్క మ్యాచ్ గెలిస్తే భారత క్రికెటర్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్తాన్, భారత పోరుకు గురించి మాట్లాడే సందర్భంలో తన పేరు ప్రస్తావనకు రావడం తనకు ఆనందంగా ఉంటుందని వెంకటేష్ ప్రసాద్ అన్నారు. చాలా ఆటగాళ్లున్నారని, వారు చరిత్ర సృష్టించగలరని అన్నారు.
పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ కోసం తాను ఎదురు చూస్తున్నానని, ఇది ఇరువైపులా క్రికెట్ అభిమానులకు పెద్ద మ్యాచ్ అని, ఈ మ్యాచ్ టికెట్లన్నీ కేవలం 20 నిమిషాల్లో అమ్ముడైనట్లు తాను విన్నానని ఆయన అన్నారు. ఆటను సజీవం చేయడానికి క్రికెటర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అన్నారు. భారత్ వెలుపల మ్యాచ్ జరిగినప్పుడు తప్పకుండా ఒత్తిడి ఉంటుందని అన్నారు.