IRE vs SA: ఫీల్డర్‌గా బరిలోకి దిగిన సౌతాఫ్రికా కోచ్ (Video)
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ జేపీ డుమిని సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చాడు. ఆటగాళ్లతో పోటాపోటీగా డైవ్ చేస్తూ పరుగులను అడ్డుకున్నాడు. అబుదాబి వేదికగా సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో డుమిని ఫీల్డర్‌గా అవతారమెత్తాడు. వేడి తీవ్రతను తట్టుకోలేక ఆటగాళ్లు అలసటకు గురికావడంతో తానే మైదానంలోకి అడుగుపెట్టాడు.
2019 జులైలోనే జేపీ డుమిని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 40 ఏళ్ల డుమిని గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్నాడు. 2004 నుంచి 2019 వరకు సౌతాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడిన డుమిని ఆల్‌రౌండర్‌గానే కాకుండా బెస్ట్ ఫీల్డర్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా నామమాత్రపు మూడో వన్డేలో ఐర్లాండ్ చేతిలో 69 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. వన్డే ఫార్మాట్‌లో ఐర్లాండ్ చేతిలో సౌతాఫ్రికా ఓటమిపాలవ్వడం ఓవరాల్‌గా ఇది రెండోసారి. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 284 పరుగులు చేసింది. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (88; 92 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (60; 48 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) సత్తాచాటారు.
బాల్బిర్నీ (45; 73 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), క్యాంపర్ (34; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో విలియమ్స్ నాలుగు, బార్ట్‌మన్, ఫెలుక్వాయో చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. జేసన్ స్మిత్ (91; 93 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు. ఛేజింగ్‌లో దక్షిణాఫ్రికాకు శుభారంభమే దక్కలేదు.
10 పరుగులకే మూడు, 79 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జేసన్ స్మిత్ గొప్పగా పోరాడాడు. కానీ అతని పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్, గ్రాహమ్ చెరో మూడు వికెట్లు, మార్క్ అడైర్ రెండు వికెట్లు తీశారు.
Coach JP Duminy fielding for South Africa pic.twitter.com/DTppCnT2Cz
— cricket station (@ShayanR84472894) October 7, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications