పెళ్లి పేరుతో ప్రీతి జింటాకు పెద్ద స్కెచ్చే వేశాడుగా!
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఓ పెద్ద డ్రామాకు తెరలేపాడు. "నాకు పెళ్లి నిశ్చయమైంది.. ఆ వేడుకల కోసం నాకు సుదీర్ఘ సెలవులు కావాలి. అందుకే ఈ సీజన్‌లో మెజారిటీ మ్యాచ్‌లకు నేను అందుబాటులో ఉండలేను" అని పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు అతను ఈ బాంబు పేల్చాడు. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటాకు అతన్ని వదులుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతానని చెప్పిన ప్లేయర్‌ను అట్టిపెట్టుకోవడం వృథా అని భావించి పంజాబ్ అతన్ని వేలంలోకి వదిలేసింది.
వేలంలో సీన్ రివర్స్.. 8.6 కోట్లకు లక్నో సొంతం
అయితే ఐపీఎల్ వేలం మొదలయ్యాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనని చెప్పిన జోష్ ఇంగ్లిస్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య తీవ్రమైన బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి లక్నో ఏకంగా 8.6 కోట్ల భారీ ధర వెచ్చించి జోష్ ఇంగ్లిస్‌ను దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్‌లో గతంలో అతను పొందిన ధర కంటే ఇది 6 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఖంగుతిన్న పంజాబ్ యాజమాన్యం.. ఇంగ్లిస్ తమను మోసం చేశాడంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. లక్నో కోచ్‌లు జస్టిన్ లాంగర్, టామ్ మూడీలు ఆస్ట్రేలియన్లు కావడంతో వారి ప్రమేయంతోనే ఇంగ్లిస్ ఈ 'స్కెచ్' వేసి ఉంటాడని పంజాబ్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

మైదానంలో పరుగుల ఊచకోత.. రికార్డులు బ్రేక్!
ఈ వివాదాలు ఓ వైపు నడుస్తుండగానే.. మైదానంలోకి దిగిన ఇంగ్లిస్ తన బ్యాటుతో సమాధానం చెబుతున్నాడు. మే 10న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లిస్ శివతాండవం చేశాడు. చెపాక్ స్టేడియం వేదికగా కేవలం 25 బంతుల్లోనే 77 పరుగులు పిండుకుని సీఎస్కే బౌలర్లను కంటతడి పెట్టించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ చరిత్రలోనే పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. తన జట్టు సభ్యుడు, స్వదేశీ ఆటగాడు మిచెల్ మార్ష్ పేరిట ఉన్న పాత రికార్డును ఇంగ్లిస్ తుడిచిపెట్టేశాడు.
లక్నోకు కొండంత అండ.. ప్లేఆఫ్స్ రేసులో జోష్!
ప్రస్తుతం 31 ఏళ్ల ఈ ఆసీస్ వికెట్ కీపర్ లక్నో జట్టుకు ప్రధాన ఆయుధంగా మారాడు. ముంబై ఇండియన్స్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లో విఫలమైనా, రెండో మ్యాచ్‌లోనే తనలోని అసలు సిసలు విధ్వంసకారుడిని పరిచయం చేశాడు. పంజాబ్ కింగ్స్ అతనిపై ఆగ్రహంతో ఉన్నప్పటికీ.. లక్నో యాజమాన్యం మాత్రం తమ 'కోట్ల' పెట్టుబడికి తగిన ప్రతిఫలం దక్కుతోందని మురిసిపోతోంది. ఇంగ్లిస్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications