బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈసారి తమ జట్టును ఓడించడం అంత సులువుకాదని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ అన్నాడు. సొంతగడ్డపై ఆడనుండటం తమకు కలిసొస్తుందని పేర్కొన్నాడు. 1996 నుంచి భారత్-ఆసీస్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. 2016 నుంచి టీమిండియానే ఈ ట్రోఫీని వరుసగా గెలుస్తోంది.
2016/17, 2022/23లో భారత్, 2018/19, 2020/21లో ఆస్ట్రేలియా ఈ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చింది. స్వదేశంలో పాటు కంగారూల గడ్డపై టీమిండియానే పైచేయి సాధిస్తోంది. అయితే ఈ సారి లెక్క మారుతుందని హేజిల్‌వుడ్ జోస్యం చెప్పాడు. 2022/23లో జరిగిన గత టెస్టు సిరీస్ భారత్‌లో జరిగిందని, ఈసారి తమ సొంతగడ్డపై జరుగతుందని, గతంలో టీమిండియాను 36 పరుగులకే ఆలౌట్ చేశామని హేజిల్‌వుడ్ గుర్తుచేశాడు.

''ఆస్ట్రేలియాలో ఆడిన గత సిరీస్‌లో భారత్ ద్వితీయశ్రేణీ జట్టుతో ఆడిందని అంటున్నారు. అయితే కొన్నిసార్లు అత్యుత్తమ జట్టు కంటే టీమ్-బీనే ఉత్తమంగా ఉంటుంది. అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ఎంతో టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారు'' అని హేజిల్‌వుడ్ అన్నాడు.
2020/21 ట్రోఫీలో తొలి టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా తర్వాత అద్భుతంగా పుంజుకుని 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌కు ప్రధాన ప్లేయర్లు దూరమైన రహానె నేతృత్వంలో కుర్రాళ్లు సత్తాచాటారు.
నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు పెర్త్ వేదికగా నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.