
హేజిల్‌వుడ్ ఆగయా:
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఆడనున్నాడని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆడని ప్లేయర్స్.. ఇప్పుడు రెండో భాగంలో ఆయా జట్లలో ఆడే అవకాశం ఉంటే తిరిగి పాల్గొనవచ్చని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసిందని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే మిగతా సీజన్‌లో ఆడేందుకు హేజిల్‌వుడ్ అందుబాటులో ఉంటానని చెప్పడంతో.. అతడిని జట్టులోకి తీసుకున్నామని చెప్పారు. హేజిల్‌వుడ్ రాక జట్టులో ఆనందాన్ని తెచ్చిందన్నాడు.

వ్యక్తిగత కారణాలతో దూరం:
జోష్ హేజిల్‌వుడ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2020కు ముందు రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. 2020 సీజన్‌లో అతడు మూడు మ్యాచ్‌లే ఆడాడు. జట్టులో పేసర్లు ఎక్కువగా ఉండడం, విదేశీ ఆటగాళ్ల కోటా కారణంగా అతడికి ఆడే అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్ 2021కు ముందు అతడు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్థానంలో చెన్నై జేసన్ బెరెండార్ఫ్‌ను తీసుకుంది. కానీ కరోనా కారణంగా టోర్నీ మధ్యలో నిలిచిపోయేసరికి అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం లభించలేదు. విదేశీ ఆటగాళ్ల కోటాలో ఫాఫ్, బ్రేవో, కరన్, లుంగీలకే ఎక్కువగా అవకాశాలు దక్కాయి.

ఇక డబిడదిబిడే:
ఇప్పుడు ఐపీఎల్ 2021లో జోష్ హేజిల్‌వుడ్ ఆడటానికి ఒప్పుకోవడంతో చెన్నై అతడిని తిరిగి జట్టులోకి తీసుకుంది. మరోవైపు హేజిల్‌వుడ్ ఇటీవల బంగ్లాదేశ్‌తో ఆడిన టీ20 సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 8 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ జట్టుకూ ఎంపికయ్యాడు. హేజిల్‌వుడ్ అదే ఫామ్ కొనసాగించాలని చెన్నై మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హేజిల్‌వుడ్ రాకతో చెన్నై ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్లకు ఇక డబిడదిబిడే అంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే హేజిల్‌వుడ్ చెన్నై క్యాంపులో చేరనున్నాడు.

రెండో స్థానంలో చెన్నై:
ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాపడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (12 పాయింట్లు) ఆరు విజయాలతో ఉండగా.. మూడో స్థానంలో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (10 పాయింట్లు), నాలుగులో ముంబై ఇండియన్స్ (8 పాయింట్లు) ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ 12.33 సగటుతో కేవలం 37 పరుగులే చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ కూడా ఆడలేదు. దాంతో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా ధోనీ చెలరేగాలని చెన్నై అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఏడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో ధోనీ ఫెయిలైనా.. కెప్టెన్, వికెట్ కీపర్‌గా మాత్రం అద్భుతంగా రాణించాడు.


Click it and Unblock the Notifications












