Josh Hazlewood: ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్ వంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక శుభవార్త లభించింది. ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ క్వాలిఫయర్-1లో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టుకు మరింత బలం చేకూరనుంది. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్, మెంటర్ దినేష్ కార్తీక్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ క్వాలిఫయర్-1లో జట్టు తరఫున బరిలోకి దిగుతారని ధ్రువీకరించారు. ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ మే 29న చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో జరగనుంది. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.
జట్టుకు కీలకం కానున్న జోష్ హేజిల్‌వుడ్
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ హేజిల్‌వుడ్ బౌలింగ్ చేసినప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పవర్ ప్లేలో హేజిల్‌వుడ్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, డెత్ ఓవర్లలో నియంత్రణ అతడిని ఇతర బౌలర్ల కంటే భిన్నంగా చూపిస్తాయి. దీనితో పాటు జోష్ హేజిల్‌వుడ్ కు పెద్ద మ్యాచ్‌లలో చాలా అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జోష్ హేజిల్‌వుడ్ జట్టులోకి తిరిగిరావడం ఆర్సీబీకి చాలా ప్లస్ పాయింట్‌గా నిరూపించబడుతుంది.

18 వికెట్లు పడగొట్టిన జోష్ హేజిల్‌వుడ్
ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హేజిల్‌వుడ్ 18 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయినప్పటికీ హేజిల్‌వుడ్ కేవలం 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఏప్రిల్ 27 నుంచి హేజిల్‌వుడ్ ఏ మ్యాచ్ ఆడలేదు. భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ తాత్కాలికంగా రద్దు చేయబడిన సమయంలో ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. కానీ ఇప్పుడు హేజిల్‌వుడ్ తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) ఫైనల్‌కు ఆస్ట్రేలియా సన్నాహాల్లో భాగంగా హేజిల్‌వుడ్ బ్రిస్బేన్ లో శిక్షణ పొందుతున్నాడు. అక్కడ హేజిల్‌వుడ్ ఫిట్‌గా ఉన్న తర్వాత ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాడు.