
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ తడబడ్డారు. మూడో రోజు ఆరంభంలోనే భారత్ ఆరు వికెట్ కోల్పోయింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పూర్తిగా చేతులెత్తేయడంతో.. 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పయిన కోహ్లీసేన పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆసీస్ పేసర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ నిప్పులు చేరగడంతో టీమిండియా బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మూడో రోజు కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
నైట్‌వాచ్‌మెన్‌గా బరిలోకి దిగిన జస్ప్రీత్ బుమ్రా (2) మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. దీంతో భారత్ 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కమిన్స్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికి రెండు పరుగులు తీసిన బుమ్రా.. ఆరో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బెంబేలెత్తించే బౌలింగ్‌తో కంగారూ బౌలర్లు కోహ్లీసేనను ఖతం చేశారు. భారత టాప్ ఆర్డర్‌లో ఒక్కరు కూడా రెండు అంకెల స్కోర్‌ను దాటలేదు. పృధ్వీ షా (4), మయాంగ్ అగర్వాల్ (9), పుజారా (0), కోహ్లీ (4), రహానే (0)లు అందరూ టపటపా రాలిపోయారు.
ఆసీస్ స్పీడ్ బౌలర్ల ధాటికి ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ నిస్సంకోచంగా చేతులెత్తేసింది. రైట్ హ్యాండ్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ .. నిప్పులు చెరుగుతూ తన సత్తా చాటాడు. టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్న కమ్మిన్స్.. అడిలైడ్ పిచ్‌పై హడలెత్తించాడు. హేజల్‌వుడ్‌తో కలిసి కమ్మిన్స్ అసాధారణ బౌలింగ్‌తో టీమిండియా జోరుకు బ్రేకేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. మూడవ రోజు రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత దారుణమైన ఆటను ప్రదర్శించింది. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా, హనుమ విహారీలు క్రీజ్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఇండియా 79 పరుగుల ఆధిక్యంలో ఉంది.
టెస్ట్ ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ అతి తక్కువ పరుగులకు కుప్పకూలడం ఇదే మొదటిసారి. 19 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడం తొలిసారి ఇదే కావడం విశేషం. 1969లో హైదరాబాద్ వేదికగా న్యూజీలాండ్ జట్టుపై భారత్ 20 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. 1999లో మొహాలీలో అదే న్యూజీలాండ్ జట్టుపై 21 పరుగులకు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. తాజా ప్రదర్శన మరీ దారుణంగా ఉంది.