భారత్‌లోనే అత్యంత చెత్త స్టేడియం అదే: జోష్ హేజిల్‌వుడ్
ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీ తరఫున ఆడుతూ అదరగొట్టేస్తున్న ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తాజాగా చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో భారత్‌లోని వివిధ క్రికెట్ స్టేడియాలకు ర్యాంకులు ఇవ్వాలని ఆయనను కోరగా.. చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన ఎం.ఏ. చిదంబరం స్టేడియం (చెపాక్)ను దేశంలోనే అత్యంత చెత్త వేదికగా పేర్కొన్నాడు. ఒకప్పుడు తను కూడా ఇదే చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. తన ర్యాంకింగ్స్‌లో దానికి చివరి స్థానం ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
సాధారణంగా చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉండి, తక్కువ స్కోర్లు నమోదయ్యే వేదికగా పేరుగాంచింది. అయితే ఓ స్టార్ పేసర్‌గా హేజిల్‌వుడ్‌కు అక్కడి పరిస్థితులు ఏమాత్రం నచ్చలేదని స్పష్టమవుతోంది. "బ్లైండ్ ర్యాంకింగ్" ప్రక్రియలో భాగంగా స్టేడియాల పేర్లు అడగగా.. చెన్నై మైదానాన్ని అతను ఏమాత్రం సంకోచించకుండా పదో స్థానంలో (చివరి స్థానం) ఉంచాడు. స్పిన్ మాయాజాలం ఎక్కువగా ఉండే ఈ పిచ్‌పై పేసర్లకు పెద్దగా పని ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చు.

మరోవైపు బ్యాటర్లకు స్వర్గధామంగా, బౌలర్లకు పీడకలగా భావించే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియాన్ని హేజిల్‌వుడ్ తన ఫేవరెట్ వేదికగా మొదటి స్థానంలో నిలిపాడు. చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ.. అక్కడి దక్కన్ నేల అందించే అదనపు బౌన్స్ తనలాంటి పొడవైన బౌలర్లకు వికెట్లు తీయడానికి ఎంతో సహకరిస్తుందని హేజిల్‌వుడ్ వివరించాడు. తన టాప్-3 జాబితాలో చిన్నస్వామితో పాటు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియాలను చేర్చడం గమనార్హం.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పేసర్లకు అత్యంత అనుకూలంగా ఉండే ధర్మశాల, కోల్‌కతా (ఈడెన్ గార్డెన్స్), లక్నో (ఎకానా) వంటి స్టేడియాలను హేజిల్‌వుడ్ తన జాబితాలో కింది స్థానాల్లో ఉంచాడు. ఇటీవల ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఆ మైదానానికి కేవలం 9వ ర్యాంక్ మాత్రమే ఇచ్చాడు. గాయం నుంచి కోలుకుని అద్భుత ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్.. ధోనీ కోటపై చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సీఎస్కే, ఆర్సీబీ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications