ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ జోస్ బట్లర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. మార్చి 1న సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని బట్లర్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టీమిండియాపై సిరీసుల్లో వరుస ఓటముల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూపు స్టేజీలోనే ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.

గర్వకారణంగా భావిస్తున్నా..
"జట్టు కోసం సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నాను. కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో కలిసి మరో ఆటగాడు జట్టును ముందుకు నడిపిస్తాడు. నేను కేవలం సారథ్య బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నాను. జట్టులో ఎప్పటిలానే కొనసాగుతాను. నా జీవితంలో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం గర్వకారణంగా భావిస్తున్నాను." అని చెప్పుకొచ్చాడు.
కొత్త కెప్టెన్ అతడేనా?
2022 జూన్‌లో కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు జోస్ బట్లర్. అదే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలను అందుకున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్‌తో పాటు 2024 టీ20 వరల్డ్ కప్ లోనూ జట్టు చెత్త ప్రదర్శన చేసింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జోస్ బట్లర్ కెప్టెన్సీకి రిజైన్ చేశాడు. దీంతో ఇప్పుడు జట్టు కొత్త కెప్టెన్ గా హ్యారీ బ్రూక్ పేరు వినిపిస్తోంది.