లండన్: వరల్డ్‌కప్ టోర్నమెంట్ ఫైనలిస్టులు ఎవరనేది ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా జోస్యం చెబుతున్నారు. క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన గొప్ప, గొప్ప ఆటగాళ్లందరూ ప్రపంచకప్ ఫైనలిస్టులు ఎవరనే విషయంపై తమదైన శైలిలో భవిష్యవాణి చెబుతున్నారు. వారందరూ చెప్పే జోస్యాల్లో కామన్‌గా కనిపించే టీమ్.. భారత్. టీమిండియా ఫైనల్ ఆడటం ఖాయమని, ఆ జట్టుకు ప్రత్యర్థి ఎవరనే విషయంపై భేదాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు ఇంగ్లండ్ అని, మరికొందరు ఆస్ట్రేలియా అని చెబుతూ వస్తున్నారు.
తాజాగా- దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ కూడా ఈ జాబితాలోకి ఎక్కేశారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, భారత్ మధ్యే ఉంటుందని అన్నారు. విజేతగా ఎవరు ఆవిర్భవిస్తారనేది అంశాన్ని మాత్రం ఇప్పుడే చెప్పలేమని అంచనా వేశారు. ఈ రెండు జట్లలో ఎవరూ హాట్ ఫేవరెట్లు కావని తేల్చి పడేశారు. ఎవరు గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు జాంటీ రోడ్స్. రెండు జట్ల బలాబలాలు సమానంగా ఉన్నాయని, ఫైనల్లో సమవుజ్జీల పోరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుందని చెప్పారు.
ప్రపంచకప్ టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా అత్యంత నిరాశాజనకమైన ఆటతీరును ప్రదర్శించిందని అన్నారు. క్రికెట్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ దక్షిణాఫ్రికా జట్టు ఆటతీరు పట్ల ఆవేదన వ్యక్తం చేసి ఉండొచ్చని చెప్పారు. ఏబీ డివిలియర్స్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించిందని, ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి టీమ్ మేనేజ్మెంట్ సరైన కసరత్తు చేయలేదనేది స్పష్టమౌతోందని అన్నారు. ప్లాన్- బీ అనేది లేకపోవడం వల్లే తమ జట్టు రాణించలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం, పదునైన బౌలింగ్‌తో బ్యాట్స్మెన్లను కట్టి పడేయడం సాధ్యం కాలేదని అన్నారు. బ్యాట్స్మెన్లు చెలరేగిపోయి ఆడుతున్న సమయంలో.. బౌలింగ్‌లో వైవిధ్యం కనపరిచి ఉండాల్సిందని చెప్పారు.
ఒక్కో బంతి ఒక్కో రకంగా సంధించడం వల్ల బ్యాట్స్‌మెన్ అయోమయానికి గురి అవుతాడని, అలాంటి చాకచక్యం బౌలర్లలో కొరవడిందని అన్నారు. ఈ విషయంలో ఇంగ్లండ్ బౌలర్లు మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉన్నారని జాంటీరోడ్స్ అన్నారు. ఇంగ్లండ్ జట్టులో ఓ బౌలర్ నిప్పులు చెరిగే బంతులను సంధిస్తే.. ఇంకొకరు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తున్నారని అన్నారు. ఫలితంగా- బ్యాట్స్‌మెన్ కాస్త అయోమయానికి గురి అవుతారని, వారి దూకుడును నియంత్రించడానికి ఆ మాత్రం అవకాశం చాలునని జాంటీరోడ్స్ అన్నారు.