ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌ను ప్రపంచ వేదికపై ఓ శక్తివంతమైన జట్టుగా నిలబెట్టిన కోచ్ జోనాథన్ ట్రోట్ తన పదవీకాలాన్ని ముగించారు. టీ20 ప్రపంచ కప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్ ప్రయాణం గ్రూప్ దశలోనే ముగిసినప్పటికీ.. కెనడాపై గెలుపుతో గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రోట్ తన మనసులోని మాటలను పంచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
అదృష్టవశాత్తూ వచ్చిన అవకాశం.. అద్భుతమైన ప్రయాణం!
తను కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం వెనుక ఉన్న కథను జోనాథన్ ట్రోట్ గుర్తుచేసుకున్నారు. "నిజానికి ఈ పదవి నాకంటే ముందు నా సహచరుడు గ్రాహం థోర్ప్‌కు దక్కాల్సింది. కానీ ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆ బాధ్యత తీసుకోలేకపోయారు. అలా అదృష్టవశాత్తూ 2022లో ఈ అవకాశం నా తలుపు తట్టింది. దాన్ని నేను పూర్తి ఉత్సాహంతో స్వీకరించాను. ఈ నాలుగేళ్ల ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనిది" అని జోనాథన్ ట్రోట్ పేర్కొన్నారు.

ఆటగాళ్ల ఎదుగుదలే నాకు దక్కిన పెద్ద బహుమతి
మైదానంలో విజయాల కంటే, ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల్లో వచ్చిన మార్పులే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చాయని ట్రోట్ అన్నారు. "ఈ క్రికెట్ ద్వారా ఆటగాళ్లు తమ కుటుంబాల తలరాతలను మార్చుకోవడాన్ని దగ్గర నుంచి చూశాను. వారి జీవితాల్లో వచ్చిన సామాజిక, ఆర్థిక మార్పుల్లో నేను ఒక చిన్న భాగం కావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను ఈ ఆటను ఎంతలా ప్రేమిస్తున్నానో నా ఆటగాళ్లకు అర్థమైందని భావిస్తున్నాను." అని భావోద్వేగానికి గురయ్యారు.
ఆ ఒక్క మ్యాచ్ గెలిచి ఉంటే..
ప్రస్తుత ప్రపంచకప్ ప్రదర్శనపై స్పందిస్తూ.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ను ఆయన ప్రస్తావించారు. "దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మేము దురదృష్టవశాత్తూ ఓడిపోయాం. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే సూపర్-8 సమీకరణాలు మరోలా ఉండేవి. ఏదేమైనా భవిష్యత్తులో ఈ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు.
జోనాథన్ ట్రోట్ హయాంలో ఆఫ్ఘన్ సంచలనాలు
జోనాథన్ ట్రోట్ కోచ్‌గా ఉన్న సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ స్వర్ణ యుగాన్ని చూసింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లను ఓడించి సంచలనం సృష్టించింది. 2024 టీ20 ప్రపంచకప్‌లోఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారి సెమీఫైనల్‌కు చేరింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి జట్లను ఓడించి ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.వచ్చినప్పుడు ఒక విదేశీయుడిగా వచ్చిన జోనాథన్ ట్రోట్, వెళ్లేటప్పుడు ప్రతి ఆఫ్ఘన్ క్రికెట్ అభిమాని గుండెల్లో ఒక హీరోగా నిలిచిపోయారు. కెనడాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ట్రోట్‌కు అంకితం ఇవ్వడం, ఆయన పట్ల ఆటగాళ్లకు ఉన్న గౌరవానికి నిదర్శనం.