AUS vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు బౌలర్ జాన్ హేస్టింగ్స్ ఒకే ఓవర్లో ఏకంగా 12 వైడ్‌లు, ఒక నో-బాల్ విసిరి కేవలం ఒక్క ఓవర్లోనే మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టుకు అప్పగించాడు. దీనితో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 7.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సంఘటన క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. అయితే పాకిస్థాన్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాటర్లను చిన్నాభిన్నం చేశాడు. అజ్మల్ 3.5 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యం చాలా చిన్నది కావడంతో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది.

వైడ్ స్పెషలిస్ట్ హేస్టింగ్స్ - ప్రత్యర్థికి అందమైన కానుక!
75 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు మంచి స్థితిలో ఉంది. అప్పటికే వారి స్కోరు 55 పరుగులు చేరుకోగా.. ఈ దశలో ఆస్ట్రేలియా కెప్టెన్ బ్రెట్‌లీ బంతిని జాన్ హేస్టింగ్స్ చేతికి ఇచ్చాడు. ఆ దశలో పాకిస్థాన్ జట్టు గెలవడానికి మరో 20 పరుగులు మాత్రమే అవసరం. అయిచే జాన్ హేస్టింగ్స్ తన ఓవర్‌ను ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జాన్ హేస్టింగ్స్ తన ఓవర్‌ను వరుసగా 5 వైడ్‌లతో ప్రారంభించాడు. అంటే ఒక్క బంతి వేయకుండానే 5 అదనపు పరుగులు పాక్ ఖాతాలో చేరాయి. అతని ఆరో ప్రయత్నంలో మాత్రమే సరైన బంతి పడగా.. దానికి ఒక పరుగులు వచ్చింది. ఆ తర్వాత వేసిన రెండో బంతికి షార్జీల్ ఖాన్ ఫోర్ కొట్టాడు. తదుపరి బంతిని హేస్టింగ్స్ నో-బాల్ వేశాడు. ఆ వెంటనే మరో వైడ్ బంతి పడింది.
3, 4, 5వ బంతులను హేస్టింగ్స్ సరైన దిశలో వేశాడు. కానీ అక్కడితో ఆగకుండా.. అతను మళ్లీ వరుసగా 6 వైడ్‌లు వేశాడు.
ఈ విధంగా జాన్ హేస్టింగ్స్ తన ఓవర్లో మొత్తం 18 బంతులు విసిరాడు. వీటిలో 12 వైడ్‌లు, ఒక నో-బాల్ ఉన్నాయి. కేవలం 5 బంతులు మాత్రమే లీగల్ బంతులుగా నమోదయ్యాయి. ఈ అదనపు పరుగుల కారణంగా పాకిస్థాన్ జట్టు హేస్టింగ్స్ ఓవర్ పూర్తి కాకముందే 75 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది.
పాకిస్థాన్ ఛాంపియన్స్ ఘన విజయం
పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు తరఫున ఓపెనర్లు షార్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్ అద్భుతంగా రాణించారు. షార్జీల్ ఖాన్ 23 బంతుల్లో 32 పరుగులు చేయగా.. సోహైబ్ మక్సూద్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 7.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో జాన్ హేస్టింగ్స్ బౌలింగ్ ప్రదర్శన క్రీడా అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది క్రికెట్ చరిత్రలో ఒక అసాధారణమైన సంఘటనగా నిలిచిపోతుంది.