హైదరాబాద్: సెరీనా విలియమ్స్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు గాను చింతిస్తున్నానని మాజీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకన్రో వ్యాఖ్యానించాడు. రెండు రోజుల క్రితం సెరెనా విలియమ్స్ ఉత్తమ మహిళా ప్లేయరే అయినా... ఆమె పురుషుల జట్టుతో ఆడితే 700వ ర్యాంక్‌లో ఉంటుందని మెకన్రో ఇటీవల ఓ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై మెకన్రో శుక్రవారం మీడియాతో మాట్లాడాడు. 'అవును నేను అంగీకరిస్తున్నాను. అవును సెరెనా పట్ల నేను అలా మాట్లాడాల్సి ఉండకూడదు. నా వ్యాఖ్యలు ఇంతటి వివాదానికి దారి తీస్తాయని అనుకోలేదు. దీనిని ఇంతటిలో వదిలేయండి. ఆమె ఓ గొప్ప క్రీడాకారిణి' అని ఆయన అన్నారు.

కాగా మెకన్రో వ్యాఖ్యలపై సెరెనా విలియమ్స్ 'సర్.. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. మాకు కనీసం గౌరవమివ్వండి. నా సత్తాఏమిటో అందరికీ తెలుసు. నేనిప్పటిదాకా 700వ ర్యాంకర్‌తో అస్సలు ఆడనేలేదు. అలా ఆడేందుకు నాకు సమయం కూడా లేదు' అని ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చింది.
దీనిపై మెకన్రో మళ్లీ స్పందిస్తూ 'నీ సత్తా ఏంటన్నది పురుషులతో పోటీపడి నిరూపించుకో' అంటూ సెరెనాను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. మహిళలు-పురుషులు కలిసి టెన్నిస్ ఆడితేనే అది తెలుస్తుందని ఇకపై టెన్నిస్ పోటీలు నిర్వహించాలని ఓ వింత ప్రతిపాదన కూడా మెకన్రో తీసుకొచ్చాడు.
మెకన్రో వ్యాఖ్యలను రష్యా ప్లేయర్ దిమిత్రి తురుసునో సమర్థించడం విశేషం. ఒకవేళ సెరీనాతో మ్యాచ్ ఆడితే తానే గెలుస్తానన్న నమ్మకం ఉందని అన్నాడు. గతంలో పురుషులకు, మహిళలకు మధ్య మూడు సార్లు టెన్నిస్ మ్యాచ్‌లు జరిగాయి. బ్యాటిల్ ఆఫ్ సెక్స్‌స్ అన్న నినాదంతో కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించారు.
1973, మే 13న అప్పటి మహిళల స్టార్ మార్గరెట్ కోర్ట్.. మాజీ నంబర్‌వన్ ఆటగాడు బాబీ రిగ్స్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో బాబీ రిగ్స్ 6-2, 6-1తో మార్గరెట్‌పై గెలిచాడు. ఆ తర్వాత ఒక్క ఏడాది తేడాలోనే మహిళా ప్లేయర్ బిల్లీ జీన్ కింగ్ మూడు సెట్లలో బాబీ రిగ్స్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. 1992లో జిమ్మీ కానర్స్ రెండు సెట్లలో మేటి మహిళా ప్లేయర్ మార్టినా నవ్రతిలోవాపై గెలుపొందాడు.