IND vs WI 2nd Test: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కరేబియన్ జట్టు ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ అద్భుత పోరాటపటిమను ప్రదర్శించాడు. రెండో టెస్ట్ నాలుగో రోజు ఫాలోఆన్ ఆడుతున్న వెస్టిండీస్ జట్టుకు ఆశాకిరణంగా నిలిచాడు. తన టెస్ట్ కెరీర్లో క్యాంప్‌బెల్ మొదటి సెంచరీని చేరుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులకే ఔట్ అయిన క్యాంప్‌బెల్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తి భిన్నమైన ఆటతీరును కనిబరిచాడు. క్యాంప్‌బెల్ 175 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మైలురాయిని చేరుకున్నాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
ఫాలోఆన్ కష్టాల నుంచి ఉపశమనం
వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియా వారిని ఫాలోఆన్ ఆడమని కోరింది. 270 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన వెస్టిండీస్ క్యాంప్‌బెల్ సెంచరీ, శాయ్ హోప్ అద్భుతమైన మద్దతుతో కోలుకుంది. క్యాంప్‌బెల్, హోప్ కలిసి 150 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ భాగస్వామ్యం ఫలితంగా వెస్టిండీస్ జట్టు భారత ఆధిక్యాన్ని 100 పరుగుల కంటే తక్కువకు తగ్గించగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో శాయ్ హోప్ కూడా తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే ఔట్ అయిన నిరాశను ఈ సారి అధిగమించాడు.

బలంగా భారత బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(129) అద్భుతమైన సెంచరీలు సాధించి జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. వీరితో పాటు సాయి సుదర్శన్ ధాటిగా బ్యాటింగ్ చేసి 87 పరుగుల కీలక సహకారం అందించాడు. నితీష్ కుమార్ రెడ్డి 43 పరుగులు, ధ్రువ్ జురెల్ 44 పరుగులు చేసి జట్టు స్కోరును 500 మార్కు దాటించడంలో దోహదపడ్డారు.
మొత్తం మీద క్యాంప్‌బెల్ సెంచరీ, హోప్ మద్దతుతో వెస్టిండీస్ జట్టు టెస్ట్ మ్యాచ్‌లో పోరాడుతున్నప్పటికీ, భారత్ ఇప్పటికీ మ్యాచ్‌పై బలమైన పట్టు సాధించి ఉంది. అయితే క్యాంప్‌బెల్ ప్రదర్శన కరేబియన్ జట్టులో కొత్త ఆశలను రేకెత్తించింది.