
హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జోహాన్ బోథా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తాను అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు అధికారిక ప్రకటన చేశాడు. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బోథా బుధవారం సిడ్సీ సిక్సర్స్‌తో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తెలిపాడు.
ఈ సందర్భంగా బోథా మాట్లాడుతూ "ఇదొక ఎమోషనల్ మూమెంట్. నా కెరీర్‌లో తదుపరి ఫేజ్‌కు సమయం ఆసన్నమైందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నా. గత 19 ఏళ్లుగా క్రికెట్ నా జీవితంలో కలిసిపోయింది" అని 36 ఏళ్ల బోథా పేర్కొన్నాడు. తన చివరి మ్యాచ్‌లో బోథా ఒక్క వికెట్ కూడా తీయక పోయాడు.
2005 నుంచి 2012 వరకూ దక్షిణాఫ్రికా జట్టు ప్రాతినిథ్యం వహించిన బోథాకు 2016లో ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. దక్షిణాఫ్రికా తరఫున 78 వన్డే మ్యాచ్‌లు, 40 టీ20 మ్యాచ్‌లు, 5 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికా తరుపున 10 వన్డేలకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
2009లో బోథా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆ సిరీస్‌లో దక్షిణాఫ్రికా 4-1తో ఆసీస్‌పై గెలిచి అగ్రస్థానంలో నిలిచింది.