
సిరీస్ గెలుస్తాం
బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సోమవారం జోఫ్రా ఆర్చర్ మీడియాతో మాట్లాడాడు. ఇప్పటికే 1-1తో నిలిచిన సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు తప్పకుండా గెలుస్తామని ఆర్చర్ బదులిచ్చాడు. 'మేం తప్పకుండా టెస్ట్ సిరీస్ గెలుస్తాం. అయితే అంతకన్నా ముందు మూడో టెస్టులో విజయం సాధించడం ముఖ్యం. ఇది గెలిస్తే నాలుగో మ్యాచ్‌ను డ్రా చేసుకుంటాం. మేం ఎప్పుడూ గెలవాలనే ఆడతాం. కానీ రాబోయే టెస్టు అత్యంత కీలకం. ఇది గెలిస్తే చివరి టెస్టును కోల్పోకుండా చూసుకుంటాం' అని ఆర్చర్ అన్నాడు.

పింక్ అనుభవం ఉంది
అనంతరం పింక్‌బాల్‌పై జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ... 'నిజం చెప్పాలంటే పింక్ బంతి కూడా సాధారణ బంతిలాగే ఉంటుంది. పింక్ బంతితోనూ ఇంతకుముందు పలుమార్లు బౌలింగ్ చేశా' అని చెప్పుకొచ్చాడు. భారత్‌లో ఎక్కువగా స్పిన్‌కు సహకరించే పిచ్‌లు రూపొందిస్తున్నారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్పదించాడు. ఓ టెస్టు బ్యాట్స్‌మన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడేందుకు, పిచ్‌లు విసిరే సవాళ్లను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డే/నైట్ మ్యాచ్‌లు జరిగినా లైట్ల వెలుతురులో పేసర్లకు గొప్ప అవకాశం ఉంటుందన్నాడు.

బంతి ఎలా స్పందిస్తుందో తెలియదు
మొతేరా స్టేడియంలోని పిచ్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని, మ్యాచ్ ప్రారంభమయ్యేసరికి ఆ పరిస్థితి ఉండదని ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్ పేర్కొన్నాడు. పేస్ బౌలర్లుగా తాము ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. బంతి స్వింగైనా, అవ్వకపోయినా తాము చేయాల్సిన పని చాలా ఉందన్నాడు. భారత్‌లో ఇది రెండో పింక్‌బాల్ టెస్టు అని, ఇటీవలి కాలంలో మొదటిదని జిమ్మీ గుర్తుచేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో బంతి ఎలా స్పందిస్తుందో తమకు తెలియదని చెప్పాడు. అయితే నెట్ సెషన్స్‌లో మాత్రం బంతి బాగా స్వింగైనట్లు పేర్కొన్నాడు.

జోరుగా ప్రాక్టీస్
డే/నైట్ టెస్ట్ కోసం టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ సుదీర్ఘంగా బౌలింగ్ సాధన చేశారు.
PinkBall Test: ఫ్లడ్‌లైట్ల వెలుతురులో.. పింక్ బాల్‌తో కోహ్లీసేన ప్రాక్టీస్!!