
బెంగళూరు: ఐపీఎల్ 2022 మెగా వేలం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్‌ను ముంబై ఇండియన్స్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అర్చర్ ఆడడని తెలిసినప్పటికీ భారీ ధర వెచ్చించి మరి అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అర్చర్ లీగ్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇక 2 కోట్ల రూపాయల బేస్ ప్రైజ్‌తో ఈ మెగా వేలంలోకి వచ్చిన అర్చర్ కోసం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివరకు ముంబై ఇండియన్స్ 8 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. కాగా మోచేతి గాయం కారణంగా కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న అర్చర్ ఈ సీజన్‌లో ఆడే అవకాశాలు లేవు. అయినప్పటికీ ఆర్చర్‌ను 8 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇక మిగతా ఆటగాళ్ల విషయానికొస్తే రొమారియో షెపర్డ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 కోట్ల 75 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. మిచెట్ శాంట్నర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కోటి 90 లక్షల రూపాయలకు దక్కించుకుంది. డానియేల్ శామ్స్‌ను ముంబై ఇండియన్స్ 2 కోట్ల 60 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. షెర్ఫీన్ రూథర్‌ఫోర్డును రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోటి రూపాయల బేస్ ప్రైజ్‌కు దక్కించుకుంది. డేవైన్ ప్రీటోరియస్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 50 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ ధరకు కొనుగోలు చేసింది. రిషి ధావన్‌ను పంజాబ్‌కింగ్స్ 55 లక్షల రూపాయలకు దక్కించుకుంది. రోవ్మన్ పావెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ 2 కోట్ల 80 లక్షల రూపాయలకు దక్కించుకుంది. డేవాన్ కాన్వేను చెన్నై సూపర్ కింగ్స్ కోటి రూపాయల బేస్ ప్రైజ్‌కు దక్కించుకుంది. సుబ్రన్షు సేనాపతిని కూడా 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్‌కు సీఎస్కేనే కొనుగోలు చేసింది.