లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ జో రూట్ (143, 206 బంతుల్లో; 18 ఫోర్లు) సెంచరీతో సత్తాచాటాడు. అట్కిన్సన్ (74 నాటౌట్, 81 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు.
42 పరుగులకే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రూట్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. సొగసైన బ్యాటింగ్‌తో అలరించాడు. లంక బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ 18 బౌండరీలు బాదాడు. కాగా, సెంచరీ సాధించిన రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా రూట్ చరిత్రకెక్కాడు.

అంతకుముందు ఈ ఘనత రోహిత్ (48) పేరిట ఉండేది. తాజాగా ఈ రికార్డును రూట్ (49) అందుకున్నాడు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లి (80) ఉన్నాడు. మరోవైపు ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అలిస్టర్ కుక్‌తో సమంగా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ (33), కుక్ (33), కెవిన్ పీటర్సన్ (23) టాప్-3లో ఉన్నారు. కాగా, రూట్ ఈ రికార్డు శతకాన్ని తన మాజీ బ్యాటింగ్ మెంటార్, స్నేహితుడు గ్రహమ్ థోర్ప్‌కు అంకితం చేశాడు. ఈ నెలలో గ్రహమ్ మరణించాడు.
కాగా, జో రూట్ 145 టెస్టుల్లో 12274 పరుగులు చేశాడు. 33 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు బాదాడు. 171 వన్డేల్లో 6522 పరుగులు చేశాడు. 16 శతకాలు, 39 అర్ధశతకాలు సాధించాడు. అయితే 2020 వరకు రూట్ టెస్టుల్లో 17 సెంచరీలు మాత్రమే బాదాడు. కానీ ఆ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. నాలుగేళ్లలో 16 సెంచరీలతో కదం తొక్కాడు.