
డరెల్ మిచెల్ సెంచరీ ప్లస్, టామ్ బ్లండెల్ సెంచరీ మిస్
మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 236/4తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 285పరుగులకే ఆలౌటైంది. డరైల్ మిచెల్ (203బంతుల్లో 108పరుగులు 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా.. టామ్ బ్లండెల్ (198 బంతుల్లో 96పరుగులు, 12 ఫోర్లు) సెంచరీ మిస్సయ్యాడు. మూడో రోజు కివీస్ కేవలం 49 పరుగులు మాత్రమే చేసి 6వికెట్లు కోల్పోయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మాథ్యు పాట్స్, స్టువర్ట్ బ్రాడ్ చెరో 3వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. అండర్సన్ 2, పార్కిన్సన్ 1 వికెట్ తీశారు. దీంతో 277పరుగుల టార్గెట్ ఇంగ్లాండ్ ముందు న్యూజిలాండ్ ఉంచింది.

బెంబేలెత్తించిన జేమీసన్, 69పరుగులకే 4వికెట్లు
277పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే టైంకి 5వికెట్లు కోల్పోయి 216పరుగులు చేసింది. జో రూట్ (131 బంతుల్లో 77పరుగులు నాటౌట్; 7 ఫోర్లు), బెన్ ఫోక్స్ (9పరుగులు నాటౌట్) ఇంకా క్రీజ్‌లో ఉన్నారు. విజయానికి ఇంగ్లాండ్ మరో 61పరుగులు చేయాల్సి ఉంది. ఇక ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఏమాత్రం శుభారంభం దొరకలేదు. కైలీ జేమీసన్ (4-59) ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి వికెట్‌కు అలెక్స్ లీ (20పరుగులు)ను బోల్డ్ చేసిన జేమీసన్, తర్వాత క్రాలీని స్లిప్ క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో 32పరుగులకే ఓపెనర్లిద్దరు పెవిలియన్ బాట పట్టారు. ఇక తర్వాత ఓలీ పోప్ (10)ను బౌల్ట్ అద్భుతమైన బాల్‌తో బౌల్డ్ చేశాడు. తర్వాత బెయిర్ స్టో (16)ను కూడా కైలీ జేమీసన్ ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వలేదు. ఇక 69పరుగులకే 4వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది.

లక్కీగా బతికిపోయిన స్టోక్స్.. రూట్‌తో కలిసి గెలుపు రూట్ వేసి
ఇక ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతలను మాజీ సారథి జో రూట్, ప్రస్తుత కెప్టెన్ బెన్ స్టోక్స్ తీసుకున్నారు. గ్రాండ్ హోమ్ బౌలింగ్లో 1పరుగుకే ఔటయిన స్టోక్స్.. లక్కీగా నోబాల్ ద్వారా బతికిపోయాడు. ఇక వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న స్టోక్స్ చూడచక్కని షాట్లతో హాఫ్ సెంచరీతో అలరించాడు. జో రూట్‌తో కలిసి 5వికెట్‌కు 90పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఇక ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. స్టోక్స్ (54పరుగులు 110బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు)ను కీపర్ క్యాచ్ ఔట్ చేశాడు. స్టోక్స్ ఔటయినా.. జోరూట్ మొండిగా క్రీజులో నిలిచి పోరాడాడు. బెన్ ఫోక్స్ (9)తో కలిసి ఇన్నింగ్స్‌ను విజయం దిశగా నడిపిస్తున్నాడు. ఇక ఆట ముగిసేసమయానికి రూట్ (77పరుగులు), ఫోక్స్ (9)క్రీజులో ఉన్నారు. 5వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 216పరుగులు చేసింది.

స్కోర్ సమరీ
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 132
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ - 141
న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ - 285
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ - 216 / 5వికెట్లు
ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 61పరుగులు కావాల్సి ఉండగా.. న్యూజిలాండ్ విజయానికి ఇంకా 5వికెట్లు కావాలి.


Click it and Unblock the Notifications












