
లండన్: ఆస్ట్రేలియా టీ20 లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్‌లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సిడ్నీ థండర్స్ తరుపున ఆడనున్నాడు. ఈ మేరకు సిడ్నీ థండర్స్ యాజమాన్యం అతడితో ఒప్పందం చేసుకుంది. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) 8వ సీజన్ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో జో రూట్‌తో పాటు జోస్ బట్లర్ కూడా బీబీఎల్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో పాటు వెస్టిండిస్ దేశాల్లో పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ బీబీఎల్‌కు సగం టోర్నీ వరకే అందుబాటులో ఉండనున్నారు.
ఈ సందర్భంగా జో రూట్ మాట్లాడుతూ "బిగ్‌బాష్ లీగ్ అనేది ఆసక్తికర టోర్నీ. ఈ విషయం ఆ టోర్నీని చూసే ప్రతి ఒక్కరికీ అర్ధం అవుతుంది. సిడ్నీ థండర్స్ తరుపున బరిలోకి దిగడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా" అని తెలిపాడు.
సిడ్నీ థండర్స్ జట్టు తరుపున ఆడే విషయాన్ని జో రూట్ గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించాడు. అయితే, ఇంగ్లాండ్ బోర్డు మాత్రం ఆటగాళ్ల వర్క్ లోడ్ విషయంలో ఆచితూచి వ్యవహారిస్తోంది. అందుకు కారణం ఒకటి వచ్చే ఏడాది వరల్డ్ కప్ ఉండటం కాగా, రెండోది యాషెస్ సిరిస్‌ను దృష్టిలో పెట్టుకుని.
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌కు తాను అందుబాటులో ఉండటం లేదని జో రూట్ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో జరిగిన ఐపీఎల్ వేలంలో జో రూట్‌ను ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేయని సంగతి తెలిసిందే.