
చెన్నై: భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేశాడు. రూట్ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) గ్రేట్ ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. దీంతో టెస్టు క్రికెట్లో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ సర్ డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత వరుసగా 150కు పైగా పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా ఇంగ్లీష్ సారథి రూట్ నిలిచాడు.
కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న జో రూట్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండు రోజులుగా భారత బలౌర్ల సహనాన్ని పరీక్షించిన రూట్ చివరకు అవుట్ అయ్యాడు. 218 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. అయితే 1937లో టెస్టు క్రికెట్‌లో వరుసగా 150కి పైగా రన్స్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా డాన్ బ్రాడ్‌మాన్ చరిత్ర సృష్టించాడు. 84 ఏళ్ల తర్వాత 150+ స్కోర్లతో హ్యాట్రిక్ మైలురాయి అందుకున్న మొదటి కెప్టెన్‌గా రూట్ నిలిచాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ రూట్ వరుసగా 228, 186 పరుగులతో చెలరేగాడు.
వందో టెస్టులో శతకం బాదిన తొమ్మిదో ఆటగాడిగా జో రూట్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. కొలిన్ కౌడ్రె, జావెద్ మియాందాద్, గార్డన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టీవార్ట్, ఇంజమామ్, రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, హషిమ్ ఆమ్లా మాత్రమే ఇంతకుముందు ఆ ఘనత సాధించారు. 98, 99, 100వ టెస్టుల్లో సెంచరీ, 150కిపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రూట్ మాత్రమే కావడం విశేషం. ఆసియా ఖండంలో వరసగా మూడు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 100వ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇంజామామ్ ఉల్ హక్ 184 పరుగుల రికార్డను రూట్ తిరగరాశాడు.
మరోవైపు రూట్ వరుస టెస్టుల్లో అత్యధికసార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో ఏడో స్థానంలో నిలిచాడు. కుమార సంగక్కర (2007) వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆ ఘనత సాధించి అందరికన్నా ముందున్నాడు. తర్వాత వాలీ హేమండ్ (1928-29), డాన్ బ్రాడ్‌మన్ (1937), జహీర్ అబ్బాస్ (1982-83), ముదస్సార్ నజర్ (1983), టామ్ లాథమ్ (2018-19), జోరూట్ (2021) మూడు మ్యాచ్‌ల్లో 150కిపైగా పరుగులు సాధించారు.