హైదరాబాద్: క్రికెట్ ఆడుతూ రొమాంటిక్ లైఫ్‌ను తాను ఎంజాయ్ చేయలేనని భారత మహిళల జట్టు పేసర్ ఝలన్ గోస్వామి స్పష్టం చేసింది. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో ఝలన్ గోస్వామి అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది.
'ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్‌పైనే ఉంది. మ్యాచ్‌లతో బిజీగా గడుపుతున్నాను. ఈ తరుణంలో వేరే అంశాలకి సమయం కేటాయించలేను. ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్‌కి. ఒకవేళ దానివైపు దృష్టి కేంద్రీకరిస్తే.. నా ఆటకి న్యాయం చేయలేను. కాబట్టి ఏదో ఒకదానికే సమయం కేటాయించాలని నేను నిశ్చయించుకున్నా' అని గోస్వామి చెప్పింది.

'ఫ్యామిలీ జీవితానికి, వృత్తి జీవితానికి తగిన సమయం కేటాయించలేక ఇబ్బందిపడుతున్న చాలా మంది స్నేహితులను నేను చూశాను. అయినా.. నా వివాహ బంధానికి ఇంకా చాలా సమయం ఉంది' అని గోస్వామి వివరించింది. 34 ఏళ్ల గోస్వామి 2002లో భారత్ జట్టులోకి అరంగ్రేటం చేసింది.
కాగా, లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో 23 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.