హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి ప్రపంచ రికార్డుని సృష్టించింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. 180 వికెట్లతో ఆస్ట్రేలియాకు చెందిన కేథిరన్ ఫిజ్‌ఫ్యాట్రిక్ నెలకొల్పిన రికార్డును ఝులన్ అధిగమించింది.
దక్షిణాఫ్రికా ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఝులన్ గోస్వామి ఈ రికార్డుని నెలకొల్పింది. 153 మ్యాచ్‌ల్లో 21.76 యావరేజితో 181 వికెట్లు తీసింది. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్లు, నాలుగు సార్లు 4 వికెట్లు సాధించింది.

భారత్‌కు చెందిన మరో బౌలర్ నీతూ డేవిడ్ 141 వికెట్లతో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. 2006-07 సీజన్‌లో ఝులన్ గోస్వామి నేతృత్వంలోని టీమిండియా తొలిసారి ఇంగ్లాండ్‌పై టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంది.
34 సంవత్సరాల గోస్వామి 2002లో ఇంగ్లండ్‌పై చెన్నైలో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసింది. 2007లో భారత్‌లో జరిగిన ఆప్రో-ఆసియా టోర్నీలో ఆడిన ఆసియా జట్టులో సభ్యురాలిగా కూడా ఉంది. 2007లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన గోస్వామి ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది.
2008లో ఝులన్ గోస్వామిని తప్పించి ఆమె స్ధానంలో హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్‌ని కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. వెస్ట్ బెంగాల్‌లో పుట్టిన గోస్వామి 2010లొ అర్జున అవార్డుని, ఆ తర్వాత రెండు సంవత్సరాలకు పద్మశ్రీ అవార్డును అందుకుంది.