
రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పంచుకున్న సందేశంలో.. మీ నుంచి ఎల్లప్పుడూ లభించే ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అని ధోనీ రాశారు. ఈ సాయంత్రం 7.29 తర్వాత నన్ను పదవీ విరమణ చేసినట్లు ఆలోచించండి అని తన పోస్టులో పేర్కొన్నారు. మహీ రిటైర్మెంట్‌పై ఎందరో స్పందించారు. ఈ క్రమంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కీలక సూచన చేశారు.
ఎంఎస్ ధోనీ కోసం ఫేర్‌వెల్ మ్యాచ్ నిర్వహించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి సూచించారు. జార్ఖండ్ అందుకు వేదిక అవుతుందని కూడా ప్రకటించారు. ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ కావడంతో.. ఫేర్‌వెల్ మ్యాచ్ కోసం రాంచీని వేదిక చేయాలని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ భావిస్తున్నారు. మరి సీఎం అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఫేర్‌వెల్ మ్యాచ్ జరిగితే మాత్రం ధోనీ అభిమానులకు పండగే.
ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమెస్క్ ప్రసాద్ స్పందించారు. ధోనీ సుదీర్ఘ కాలంగా క్రికెట్ రంగానికి ఎంతో సేవలందించారని ప్రశంసించారు. భారత క్రికెట్ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడని తెలిపారు. 'మహీ భారత క్రికెట్ జట్టు గెలుపు కోసం ఒక నిజమైన సైనికుడిలా పనిచేశాడు. తద్వారా క్రికెట్ ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. చరిత్రలో ఎప్పటికీ ధోనీ ఓ గొప్ప కెప్టెన్‌గా మిగిలిపోతాడు. మహి రిటైర్మెంట్‌కు ప్రత్యేక కారణాలేమీ ఉండకపోవచ్చు. కేవలం ధోనీ వ్యక్తిగత నిర్ణయమే అని న అభిప్రాయం. అతడికి రిటైర్మెంట్‌పై స్పష్టత ఉంది. తనకు అనుబంధం ఉన్న ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉండొచ్చు' అని ప్రసాద్ పేర్కొన్నారు.
2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. ఆ తర్వాత 2007 టీ20 ప్రపంచకప్ సారథిగా ధోనీకి బాధ్యతలు అప్పగించారు. అందివచ్చిన అవకాశాన్ని మహీ సద్వినియోగం చేసుకున్నాడు. కుర్రాళ్లతో కూడిన జట్టుతో తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్‌ను నిలబెట్టాడు. దీంతో అతడి అభిమానుల సంఖ్య తారాస్థాయికి పెరిగింది. అతడిలానే యువత హెయిర్ కట్‌ను అనుకరిస్తూ ధోనీని ఆరాధించారు. తర్వాత భారత్ జట్టుకు పూర్తిస్థాయి సారథిగా మారాడు.ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులను సాధించాడు. 2009లో టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలబెట్టాడు. 28 ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారత అభిమానుల ప్రపంచకప్ కలను సాకారం చేశాడు. అంతేకాకుండా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందుకున్నాడు. ఇలా భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యయనాన్ని నెలకొల్పాడు.