హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత టీమిండియా మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ టైగర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి పెద్ద అభిమాని అని సాక్షాత్తూ అతని భార్య, బాలీవుడ్ నటి షర్మిలా ఠాగూర్ వెల్లడించారు. తన భర్త పటౌడీ బ్యాటింగ్ అంటే జయలలితకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
జయలలితను చాలా సందర్భల్లా తాను కలిసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 1960వ దశకంలో తాను జయలలితను పలు సందర్భాల్లో కలిశానని షర్మిలా చెప్పారు. అప్పట్లో జయ చెన్నైలోని చర్చ్ పార్కు స్కూలులో చదువుకునేదని చెప్పారు.

క్రికెట్ మ్యాచ్ జరిగినపుడు ప్రత్యక్షంగా వీక్షించేందుకు జయలలిత బైనాక్యులర్స్ తీసుకొని వచ్చేదని షర్మిలా ఠాగూర్ అన్నారు. క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే జయలలిత పటౌడీతో పాటు మరో మాజీ కెప్టెన్ నారీ కాంట్రాక్టర్‌ను కూడా అమితంగా అభిమానించేవారని షర్మిలా ఠాగూర్ అన్నారు.
ఇదిలా ఉంటే 1990 దశకంలో సిమి గారేవాల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో జయలలిత టీమిండియా బ్యాట్స్‌మెన్ నారీ కాంట్రాక్టర్ అంటే ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో షమ్మీ కపూర్‌తో పాటు నారీ కాంట్రాక్టర్ అంటే ఎంతో ఇష్టమని ఆ ఇంటర్యూలో వెల్లడించారు.
జయలలిత మృతి తర్వాత దానికి సంబంధించిన ఇంటర్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, డిసెంబరు 16వ తేదీన చెన్నైలో ప్రారంభం కానున్న భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ సందర్భంగా క్రికెట్ అభిమాని అయిన జయలలితకు నివాళులు అర్పించనున్నట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కేఎస్ విశ్వనాథన్ తెలిపారు.