హైదరాబాద్: ఎప్పుడూ రాజకీయాలతో బిజీ బిజీగా ఉండే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఓ క్రికెటర్ అంటే ఎంతగానో ఇష్టమట. ఓ క్రికెటర్ అంటే తనకు ఎంతో ఇష్టమని 1990ల్లో జయలలిత చెప్పిన ఓ ఇంటర్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఆ ఇంటర్యూలో సిమి గారేవాల్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా జయలలిత టీమిండియా బ్యాట్స్‌మెన్ నారీ కాంట్రాక్టర్ అంటే ఇష్టమని చెప్పింది. అంతేకాదు ఇంటర్యూలో స్కూల్ గర్ల్‌గా తన చిన్నతనంలో కలలతో పాటు ఫేవరేట్ హీరో పేరుని కూడా వెల్లడించింది.
జయలలితకు బాలీవుడ్ హీరో షమ్మీ కపూర్‌తో పాటు నారీ కాంట్రాక్టర్ అంటే ఎంతో ఇష్టమని అందులో వెల్లడించింది. 'అవును(నేను ఆకర్షించబడ్డాను). నాకు బాగా గుర్తు క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ అంటే ఎంతో ఇష్టం. అతనిని చూసేందుకు నేను టెస్టు మ్యాచ్‌లకు కూడా వెళ్లాను. షమ్మీ కపూర్ అంటే కూడా ఇష్టమే' అని జయ అన్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ నారీ కాంట్రాక్టర్ భారత్ తరుపున 31 టెస్టు మ్యాచ్‌లాడాడు. 1955లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన నారీ కాంట్రాక్టర్ తన చివరి టెస్టు మ్యాచ్‌ని 1962లో ఆడాడు. కరేబియన్ ఐలాండ్‌లో బంతి బలంగా తలను తాకడంతో గాయం పాలైన కాంట్రాక్టర్ అర్దాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాడు.
1962లో బార్బడోస్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండిస్ ఫాస్ట్ బౌలర్ ఛార్లీ గ్రెఫిత్ వేసి బౌన్సర్ కాంట్రాక్టర్ తలను గట్టిగా తాకింది. దీంతో ముక్కు, చెవుల నుంచి రక్తం కారడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ టెస్టు అనంతరం కాంట్రాక్టర్ క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యారు.
75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) డిసెంబర్ 5 (సోమవారం) రాత్రి కన్నుమూశారు. సోమవారం రాత్రి 11.30కు జయలలిత మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు అమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి.
ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమెను ఖననం చేయనున్నారు. జయ మృతితో చెన్నై జనసంద్రమైంది. ఆమె పార్ధీవ దేహాన్ని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జయ అభిమానులు చెన్నైకి చేరుకున్నారు. జయ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.