
కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో టీమిండియాకు ఓటమి ఖాయమనుకున్న దశలో దీపక్ చాహర్ అనూహ్యంగా చెలరేగి జట్టును విజయ తీరాలను చేర్చాడు. కానీ ఈ క్రమంలో చాహర్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొన్న చాహర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54 పరుగులతో సత్తా చాటాడు. అయితే చాహర్ ఔటయ్యాక సరైన బ్యాటర్ లేకపోవడంతో టీమిండియా ఓడిపోయింది. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన చాహర్ గ్రౌండ్‌లోనే కంటతడి పెట్టాడు. ప్రస్తుతం చాహర్ కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో చాహర్ బౌలింగ్‌లోనూ 2 వికెట్లు తీసి సత్తా చాటాడు.
దీపక్ చాహర్ కంటతడి పెట్టుకోవడంపై అతనికి కాబోయే భార్య జయ భరద్వాజ్ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సందేశాన్ని పంచుకుంది. జట్టులో చోటు దక్కనప్పుడు ఇంతకంటే ఎక్కు వ బాధగా ఉంటుందని రాసుకొచ్చింది. క్రికెట్‌లో కొన్నిసార్లు ఇలాంటి కఠిన సవాళ్లు ఎదురవుతుంటాయని ఆ సందేశంలో తెలిపింది. అయితే ఆట పట్ల చాహర్‌కు ఉన్న అభిరుచి, అంకితభావం, చివరి వరకు పోరాడేతత్వం మైదానంలో అతన్ని ఛాంపియన్‌గా నిలబెడతాయని అమె చెప్పింది. ఇక క్రికెట్‌లో గెలుపోటములు సహజమని చెప్పుకొచ్చింది. అయితే చివరి వరకు చాహర్ పోరాడిన తీరు పట్ల దేశం గర్విస్తోందని, కఠిన పరిస్థితుల్లో జట్టుకు మీరు ఉన్నారని నిరూపించారని ఆమె కొనియాడింది. చివరగా చాహర్‌ను చూస్తే గర్వంగా ఉందని జైహిందూ అంటూ జయ భరద్వాజ్ రాసుకొచ్చింది.
కాగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోవడంతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ తప్పలేదు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను 1-2తో కోల్పోయిన భారత్.. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. దీంతో చాలా కాలం తర్వాత భారత జట్టు ఓ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అంతేకాకుండా ఈ సిరీస్‌తో తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ విమర్శల పాలయ్యాడు. తన ఫెయిల్యూర్ వ్యూహాలతో చెత్త కెప్టెన్సీ అని పేరు తెచ్చుకున్నాడు. భాగస్వామ్యాలను విడదీయడానికి బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేదని రాహుల్‌పై క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులు మండిపడుతున్నారు. దీంతో రాహుల్ భవిష్యత్ కెప్టెన్సీ అయోమయంలో పడింది. అయితే రానున్న రోజుల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు.