
కెప్టెన్సీ విషయంలో బాబర్ ఆజామ్‌తో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చాలా 'నిజాయితీ'గా ఓ సారి మాట్లాడి.. ఆజామ్ మనసులోని మాట కనుక్కోవాలని పాక్ మాజీ బ్యాటర్ జావేద్ మియాందాద్ అభిప్రాయపడ్డాడు. బాబర్ ప్రస్తుతం పాకిస్థాన్‌కు ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను బ్యాటింగ్లోను గొప్ప ప్రదర్శనలు కనబర్చుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏడు మ్యాచ్‌ల సిరీస్లో ఇంగ్లాండ్‌పై ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీని బాబర్ నమోదు చేశాడు. అతను బ్యాటింగ్ పరంగా మంచి టచ్ కనబర్చుతున్నాడు. అయితే కెప్టెన్సీలో బాబర్‌కు ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయేమో.. కనుక్కుని ఉంటే దాన్ని దృష్టిలో ఉంచుకుని పీసీబీ తదుపరి నిర్ణయం తీసుకోవాలని మియాందాద్ అన్నాడు.
'బాబర్ ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్. అయితే కెప్టెన్సీ అతనిపై ప్రభావం చూపుతుందా అనేది బోర్డు ఒకసారి అతన్ని అడగాలి. బాబర్‌కు, బోర్డుకు మధ్య నిజాయితీతో కూడిన డిస్కషన్ జరగాలి. అతను కెప్టెన్సీ కారణంగా రాణించలేనని, ఫీల్డ్‌లో కూడా లీడ్ చేయడం ఇబ్బంది పడుతున్నానని భావిస్తే.. అతన్ని సగర్వంగా కెప్టెన్సీ నుంచి తప్పించాలి. అయితే కెప్టెన్‌గా తనకు అన్ని విధాలా ఓకే అని బాబర్ చెబితే బోర్డు అతన్నే కొనసాగించాలి' అని మియాందాద్ పేర్కొన్నాడు. .
భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన కనబరిచేలా పాకిస్థాన్ క్రికెటర్లు తమ ఆటను కాస్త మార్చుకోవాల్సిన అవసరముందని మియాందాద్ అన్నాడు. 'పాకిస్థాన్‌కు ( నా జాతీయ జట్టు) ఆడుతున్నట్లు ఆటగాళ్లు ముందుగా ఆలోచించాలి. ఆ ఫీలింగ్ ఒక్కసారి మనసులోకి వస్తే.. మీరు బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా లేదా ఫీల్డింగ్ చేసినా ఆటోమేటిక్‌గా మీ నుంచి ఎక్స్ ట్రా ఎఫర్ట్ వస్తుంది. తాము బెస్ట్ ప్లేయర్లం కాబట్టే చివరి ప్లేయింగ్ 11 జట్టులో ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. మీరు బానే ఆడగలరా లేదా అనే ప్రశ్నే మనసులో తలెత్తొద్దు. మీదైనా రోజున మీరు ఏమి చేసి చూపించగలరో దాన్ని చూపించాలి.' అని మియాందాద్ అన్నాడు. పాకిస్థాన్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్ ప్రస్తుతం 3-3తో సమంగా ఉంది. ఇకపోతే లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో నేడు చివరి మ్యాచ్ జరగనుంది. అనంతరం టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆస్ట్రేలియాకు వెళుతుంది.