హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై తాను చేసిన పరుష వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు కవి, ప్రముఖ సినీ రచయిత జావెద్ అక్తర్ వెల్లడించారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధిని గురమెహర్ కౌర్ విషయంలో సెహ్వాగ్ చేసిన వ్యంగ్యపు ట్వీట్‌పై జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే.
క్రికెటర్ సెహ్వాగ్‌ను తన ట్విట్టర్‌లో 'ఏమాత్రం చదువులేని క్రీడాకారులు.' అని సంబోధిస్తూ ట్వీట్ చేశారు. అయితే గుర్‌మెహర్ కౌర్ పట్ల తాను చేసిన ట్వీట్లపై సెహ్వాగ్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుర్‌మెహర్ పట్ల ఎటువంటి వ్యతిరేక భావం లేదని, ఎవరి అభిప్రాయాలనో తప్పుబట్టడం తన ఉద్దేశం కాదని, కేవలం సరదా కోసమే అలా ట్వీట్ చేశానని చెప్పాడు.
ఈ నేపథ్యంలో జావేద్ అక్తర్ కూడా తాన పరుష వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. సెహ్వాగ్ గొప్ప ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నాడు. అదే విధంగా గుర్‌మెహర్ కౌర్‌కు మద్దతిచ్చిన గౌతమ్ గంభీర్‌కు జావెద్ కృతజ్ఞతలు చెప్పారు.