హైదరాబాద్: టీమిండియా యువ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరిస్‌లో వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని పొగడ్తల్లో ముంచెత్తాడు. బుధవారం గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ బుమ్రా, యజువేంద్ర చాహల్‌లు టెస్టులు ఆడేందుకు అర్హులని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడిన అనుభవం వారికి బాగా కలిసొచ్చిందని, వారిని పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. 'కివీస్‌తో చివరి టీ20లో బుమ్రా, చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్ అనుభవాన్ని వారు ఇక్కడ చూపించారు. వారిని టెస్టు మ్యాచ్‌లకు కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని అన్నాడు.

'గతంలో న్యూజిలాండ్‌పై ఒక్క టీ20లోనూ గెలవని భారత్.. ఇప్పుడు సిరీస్ విజయం సాధించడం ప్రత్యేకమనే చెప్పాలి. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత బలమైన జట్టుగా మారే సామర్థ్యం ప్రస్తుత ఉన్న జట్టుకు ఉంది' అని గవాస్కర్ అన్నాడు. తిరునంతపురం వేదికగా జరిగిన మూడో టీ20లో కివీస్‌పై భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 67 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 68 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్‌పై తొలిసారి భారత్ టీ20 సిరిస్‌ను గెలిచింది.
టీమిండియాతో జరిగిన వన్డే, టీ20 సిరీసుల్లో న్యూజిలాండ్ గట్టి పోటీనిచ్చిన సంగతి తెలిసిందే. రెండు ఫార్మాట్లలో కూడా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లోనే ఫలితం తేలడం విశేషం.