బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అదిరే ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి తన సత్తా ఏంతో మరో సారి చాటాడు. బుమ్రాతో పాటు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ కూడా మంచి పెర్ఫామెన్స్ తో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు. దీంతో వీరిద్దరూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ డిసెంబర్ రేసులో నిలిచారు. అయితే చివరికి ఆ అవార్డు బుమ్రానే వరించింది. టీమిండియా తరఫున కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు టాప్ వికెట్ టేకర్‌గా నిలవడం వల్ల అతడినే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఐసీసీ సెలెక్ట్ చేసింది.
కాగా, బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా బుమ్రానే దక్కించుకున్న విషయం తెలిసిందే. ''ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నన్ను ఎంచుకోవడంపై ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. మన ప్రదర్శనను గుర్తిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రపంచ క్రికెట్‌లో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ అత్యంత కఠినమైనది. బాగా పోటీ పడే సిరీస్ ఇది. నా దేశం కోసం గొప్ప ప్రదర్శన చేయడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది'' అని బుమ్రా సంతోషం వ్యక్తం చేశాడు.

ఆస్ట్రేలియా ప్లేయర్ అన్నాబెల్ సదర్లాండ్ కూడా ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ముద్దాడింది. టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసుల్లో అదిరే ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ పై సెంచరీ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటింది. దీంతో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకుంది.
'' నాకు డిసెంబర్ ఎంతో అద్భుతమైన నెల. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. జట్టులో లోతైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఉన్నాయి. దీంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం నాకు దొరికింది. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. వచ్చే వరల్డ్ కప్ కోసం ఈ వన్డే సిరీస్‌లు మాకు అత్యంత కీలకమైనవి. అందుకే ఇందులో గెలుపొందడం మరింత ఆనందంగా ఉంది'' అని సదర్లాండ్ చెప్పుకొచ్చింది.