టీమిండియా సూపర్ స్టార్ జస్‌ప్రీత్ బుమ్రా.. వెన్ను గాయం కారణంగా చాలా కాలంగా క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో న్యూజిల్యాండ్ వెళ్లిన అతను.. అక్కడే ఆపరేషన్ చేయించుకున్నాడు. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో కోలుకుంటున్నాడు. ఇప్పటికే బుమ్రా చాలా వరకు కోలుకున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో అతను మళ్లీ టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే తను త్వరలోనే టీమిండియా పునరాగమనం చేస్తానని బుమ్రా తాజాగా హింట్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్ వీడియో పోస్టే చేశాడీ ఫాస్ట్ బౌలర్. వీటిలో తన ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. 'కమింగ్ హోం' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడీ స్టార్ పేసర్. గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో అతన్ని ఆడించగా.. రెండో మ్యాచ్‌లోనే గాయం తిరగబెట్టడంతో విలవిల్లాడాడు.

అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్.. ఏదీ ఆడలేదు. అయితే ఈ ఏడాది చివర్లో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లలో అతను ఆడితేనే భారత్ గెలిచే అవకాశాలు ఉంటాయి. బుమ్రా లేకపోవడంతో భారత జట్టులో సరైన పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం బుమ్రా చాలా వరకు కోలుకున్నాడని, ప్రాక్టీస్ సెషన్స్‌లో 8-10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడని సమాచారం.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టులో జరిగే ఐర్లాండ్ టూర్‌లో బుమ్రా మళ్లీ భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత బృందం ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ కోసం వెళ్లనుంది. అక్కడకు బుమ్రాను కూడా పంపాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారని సమాచారం. బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్‌లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో పదును కనిపించడం లేదు. అతను తిరిగొస్తే భారత జట్టు పూర్తి బలంతో వన్డే వరల్డ్ కప్ బరిలో దిగుతుంది.