
కౌగిలింతలు లేకుంటే ఇబ్బందేమీ లేదు
తాజాగా జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ... 'వికెట్లు తీసినప్పుడు కౌగిలింతలు, హైఫైవ్‌లు లేకుంటే ఇబ్బందేమీ లేదు. ఉమ్మితో రుద్దే నిబంధనపైనే నేను ఆసక్తిగా ఉన్నా. క్రికెట్ పునః ప్రారంభమైన తర్వాత మేం ఏయే మార్గదర్శకాలు అనుసరించాలో ఇంకా తెలియదు. అయితే ఉమ్మికి మాత్రం ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాల్సిందే. బంతిపై మెరుపు లేకుంటే.. బౌలర్లకు కష్టం. ఒక్కోసారి మైదానాలు చిన్నవి ఉంటాయి, పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతాయి. బంతితో సంప్రదాయ స్వింగ్, రివర్స్ స్వింగ్ చేసేందుకు ఏదైనా ప్రత్యామ్నాయం అవసరం' అని అన్నాడు.

రివర్స్ స్వింగ్‌కు అవకాశమే లేదు:
'సుదీర్ఘ ఫార్మాట్‌లో పరిస్థితులు కొంతలో కొంత పేసర్లకు అనుకూలంగా ఉన్నాయి. ఏదో ఒకటి చేయొచ్చు కాబట్టే.. టెస్ట్ ఫార్మాటంటే నాకు చాలా ఇష్టం. అయితే వన్డే, టీ20 క్రికెట్లో మాత్రం అలా కుదరదు. వన్డేల్లో రెండు బంతులు ఉండటంతో.. రివర్స్ స్వింగ్‌కు అవకాశమే లేదు. న్యూజిలాండ్ వంటి దేశాల్లో బౌండరీ సరిహద్దు 50 మీటర్లలే. కాబట్టి బ్యాట్స్‌మన్ సిక్సర్‌కు ప్రయత్నించకున్నా.. బంతి సిక్సర్‌కు వెళ్తుంది. టెస్టుల్లో మాత్రం ఇబ్బంది లేదు' అని టీమిండియా పేసుగుర్రం తెలిపాడు.

బంతితో ఏదో ఒకటి చేయాలి:
'బంతి స్వింగ్ కావడంపై బ్యాట్స్‌మెన్ ఫిర్యాదులు చేస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేనెప్పుడు ఆడినా ఇలాంటివి వింటుంటాను. బంతి ఉన్నదే స్వింగ్ చేయడానికి కదా?. బంతితో ఏదో ఒకటి చేయడమే మా పని. ఊరికే అలా విసరడానికా బౌలర్లు లేరు. బ్యాట్స్‌మెన్‌కు నేనెప్పుడూ ఇదే చెబుతాను. వన్డేల్లో చివరిసారిగా బంతి ఎప్పుడు రివర్స్‌స్వింగ్ అయిందో తెలియదు. ఈ రోజుల్లో కొత్త బంతి సైతం బాగా స్వింగ్ అవ్వడం లేదు' అని బుమ్రా చెప్పాడు.

శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు:
'ఎక్కువ రోజులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవడంతో తిరిగి మైదానంలో తొలి బంతి వేసినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి. మైదానాలు తెరవగానే శిక్షణ ఆరంభిస్తా. ప్రస్తుతానికైతే దృఢంగానే ఉన్నా. సాధారణంగా నేను వారానికి ఆరు రోజులు సాధన చేస్తా. కానీ నేను బౌలింగ్ చేసి చాలా రోజులైంది. తొలి బంతి వేసేటప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఇంత సుదీర్ఘ విరామం ఎప్పుడూ రాలేదు. సాధారణంగా నా బౌలింగ్ శైలి చూసి ఎంతో మంది వ్యాఖ్యలు చేస్తారు. కానీ నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నా' అని బుమ్రా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












