'భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించను.. తర్వాతి మ్యాచ్ గురించే ఆలోచిస్తా'

గువాహటి: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక-భారత్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి 7 గంటలకు తొలి మ్యాచ్ జరగనుంది. గత ఆగస్టులో వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్ టెస్టు తర్వాత గాయంతో స్వదేశంలో జరిగిన మూడు సిరీస్‌లకు దూరమైన 'పేస్ కింగ్' జస్ప్రీత్ బుమ్రా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. బుమ్రా రాకతో భారత బౌలింగ్ బలం మరింత పటిష్టంగా మారింది. ఇక ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు కూడా బుమ్రాకు ఇది మంచి అవకాశం. నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగనున్న బుమ్రాపైనే అందరి దృష్టి ఉంది.

నా దృష్టి అంతా దానిపైనే
తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా బుమ్రా మాట్లాడుతూ... 'చాలా రోజుల తర్వాత జట్టులోకి రావడం సంతోషంగా ఉంది. మ్యాచ్ ఆడడం కోసం ఎదురుచూస్తున్నా. జట్టుకు దూరమైనా టీమిండియాను గమనిస్తూనే ఉన్నా. ఆ సమయంలో బాధగా, కష్టంగా ఏమీ అనిపించలేదు. ఆ విరామంను నా బలాన్ని పెంచుకునే అవకాశంగా భావించా. విరామం లేకుండా క్రికెట్ ఆడితే మన బలం తగ్గుతుంటుంది. ఫిట్‌నెస్ కూడా తగ్గుతుంది. ఈ విరామంలో నా బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించా. భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించను. కేవలం తర్వాతి మ్యాచ్ గురించే ఆలోచిస్తా' అని తెలిపాడు.

తీవ్రంగా శ్రమించా
'విరామం తీసుకున్న తర్వాత జట్టులోకి వస్తే మరింత కసిగా ఆడతాం. జట్టుకు దూరమైనప్పుడు నాలో ఇదే ఆలోచన ఉంది. నేను గతంలో విరామం లేకుండా క్రికెట్ ఆడా. ఆ సమయంలో వికెట్ల వేటను ఎక్కువగా కొనసాగించలేకపోయా. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మంచి సలహాలు ఇస్తారు. జట్టు సిబ్బందితో ఎప్పుడూ నేను సన్నిహితంగానే ఉంటా. జట్టు యాజమాన్యం గాయం నుంచి ఎలా కోలుకుంటున్నానని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. తొలి మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించా. నెట్స్‌లో బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్, క్యాచ్‌లు సాధన చేశా' అని బుమ్రా పేర్కొన్నాడు.

దాదా సూచన:
గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. గుజరాత్ తరఫున రంజీ బరిలో దిగాలని బుమ్రా భావించాడు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వారించడంతో వెనక్కి తగ్గాడు. వర్క్‌లోడ్‌ను దృష్టిలో పెట్టుకొని దేశవాళీకి దూరంగా ఉండాలన్న దాదా సూచనను బుమ్రా పాటించాడు.

పరుగుల వరదకు అడ్డుకట్ట:
ఇటీవల విండీస్‌తో సిరీస్‌లో బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్స్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం మేనేజ్‌మెంట్‌ను ఇబ్బంది పెట్టింది. అయితే బుమ్రా రాకతో పరుగుల వరదకు అడ్డుకట్ట పడుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ గైర్హాజరీతో.. బుమ్రాతో కలిసి శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications