
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తాను క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యుట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన బుమ్రా క్రికెట్‌లోని తన మొదటి రోజుల గురించి ఆసక్తిర విషయాలను వెల్లడించాడు. 2013లో ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ప్రస్తుతం టీమిండియాలో కూడా బుమ్రా కీలక ఆటగాడిగా ఉన్నాడు. కాగా తాను 2013లో తొలి సారి ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికయ్యానని, అయితే తొలి మ్యాచ్‌లో ఆడలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తాను, అక్షర్ పటేల్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్నామని అందుకే ముంబై ఇండియన్స్ జట్టుకు అందుబాటులో ఉండలేకపోయానని బుమ్రా గుర్తు చేసుకున్నాడు.
ఆలస్యంగా జట్టులో చేరినప్పటికీ బాగా ప్రాక్టీస్ చేశామని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. అప్పటికే బెంగళూరులో జట్టు ప్రాక్టీస్ మొదలు పెట్టిందని, తాము వెళ్లి జట్టుతో కలిసి మ్యాచ్‌కు ముందు రెండో రోజులు ప్రాక్టీస్ చేశామని చెప్పాడు. అప్పుడు ప్రాక్టీస్ సెషన్‌లో జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ను రెండు, మూడు సార్లు బౌల్డ్ చేశానని బుమ్రా గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ప్రధానంగా ఇన్‌స్వింగర్లే వేసే వాడినని చెప్పాడు. బెంగళూరు మైదానంలో పచ్చిక ఉన్నందు వల్ల బంతి స్వింగ్ అయ్యేదని, తాను కూడా ఎక్కువగా కొత్త బంతితో అందరికీ స్వింగర్లే వేసే వాడినని బుమ్రా తెలిపాడు. తన బౌలింగ్‌ను చూసి కెప్టెన్ రికీ పాంటింగ్‌తోపాటు జట్టు మేనేజ్‌మెంట్ తన బౌలింగ్‌లో వైవిధ్యం ఉందని భావించారని చెప్పాడు. అందుకే తనను తుది జట్టులో ఆడించినట్టు జస్ప్రీత్ బుమ్రా గుర్తు చేసుకున్నాడు.
2013లో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన జస్ప్రీత్ బుమ్రా ఇక వెనకకు తిరిగి చూసుకోలేదు. తనదైన ప్రత్యేక బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో, ముంబై ఇండియన్స్‌లో బుమ్రా కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అన్ని సీజన్లు బుమ్రా ముంబై ఇండియన్స్ తరఫునే ఆడాడు. ఆ క్రమంలో బుమ్రా ఇప్పటివరకు 106 మ్యాచ్‌లు ఆడి 130 వికెట్లు తీశాడు.