Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: బుమ్రాపై రోహిత్‌ సతీమణి పంచ్‌!!

Jasprit Bumrahs Pic In Mask Gets Epic Response From Rohit Sharmas Wife Ritika Sajdeh

ముంబై: కరోనా వైరస్ కారణంగా యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020 సీజన్ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరుగనుంది. వైరస్ వ్యాప్తి కారణంగా బయో బబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. యూఏఈ వెళ్లేందుకు అన్ని ఫ్రాంఛైజీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి యూఏఈకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ కూడా తమ ఆటగాళ్లకు ఇప్పటికే వైరస్ పరీక్షలు చేసింది. త్వరలోనే యూఏఈ చేరుకోనుంది.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటగాళ్లంతా ముంబైలోని రిలయన్స్‌ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది పడటం లేదు. ఒక్క వర్షం చినుకు పడకుండా పైన కప్పేయడంతో.. నెట్స్‌లో సాధన సజావుగా సాగుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్ ‌పాండ్యా, కృనాల్‌ ‌పాండ్యా ఐపీఎల్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.చాలామంది ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ శిబిరానికి హాజరుకాగా.. టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తాజాగా వచ్చాడు.

జస్ప్రీత్‌ బుమ్రా అహ్మదాబాద్‌ నుంచి రోడ్డు ప్రయాణం చేసి ముంబైకి వచ్చాడు. ముఖానికి మాస్క్ ధరించి శిబిరం లోపలికి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ ప్రాంచైజీ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే ఆ పోస్టుకు ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ సతీమణి రితికా సజ్దె సరదాగా స్పందించారు. 'హహహ.. ఓకే జస్ప్రీత్‌. నీ మాస్క్‌ వెనకాల చిరునవ్వు కోసం మేం చాలా కష్టపడాలి' అని సరదాగా పంచ్ ఇచ్చారు.

జస్ప్రీత్‌ బుమ్రా గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత చాలా కాలం ఆటకు దూరమయ్యాడు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. దాదాపు ఐదు నెలల పాటు టీమిండియాకు దూరమయ్యాడు. అనంతరం కోలుకుని ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. అయితే ఆ పర్యటనలో అతడు పెద్దగా రాణించలేదు. దాంతో విమర్శలపాలయ్యాడు. ఇక స్వదేశానికి తిరిగొచ్చాక దక్షిణాఫ్రికాతో ఆడాల్సిన వన్డే సిరీస్‌ వాయిదా పడింది. ఆ వెంటనే లాక్‌డౌన్‌ విధించడంతో ఐపీఎల్‌ 2020 నిరవధిక వాయిదా పడింది. ఇప్పుడు దుబాయ్ వేదికగా లీగ్ జరుగనుంది.

రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే నాలుగు టైటిల్స్ గెలుచుకుంది. దాంతో ఐపీఎల్‌ చరిత్రలో నాలుగోసారి టైటిల్‌ సాధించిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. గతేడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తుది పోరులో తలపడిన ముంబై.. కేవలం ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించింది. చివరి ఓవర్లో లసిత్ మలింగ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై గట్టెక్కింది. ఇక ఈసారి ఎవరు గెలుస్తారో తెలియాలంటే నవంబర్‌ 10 వరకు వేచి చూడాలి.

Story first published: Thursday, August 20, 2020, 14:04 [IST]
Other articles published on Aug 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+