
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ పేస్ బౌలర్లకు అండగా నిలుస్తాడని, నిత్యం వారిలో ఉత్సాహాన్ని నింపుతాడని కొనియాడాడు. అంతేకాకుండా కోహ్లీ సారథ్యంలో ఆడడం చాలా బాగుటుందని చెప్పుకొచ్చాడు. బౌలర్లకే కాకుండా జట్టు మొత్తంలో విరాట్ ఉత్సాహాన్ని నింపుతాడని బుమ్రా తెలిపాడు. ఇక ప్రస్తుతం మూడో టెస్టు మ్యాచ్ జరగుతున్న కేప్‌టౌన్ మైదానంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ పేస్ గన్ గుర్తుచేసుకున్నాడు. 2018లో ఇదే గ్రౌండ్‌లో తాను టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశానని అన్నాడు.
అప్పుడు కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనేనని చెప్పుకొచ్చాడు. అయితే నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇదే గ్రౌండ్‌లో 5 వికెట్లు పడగొట్టడం తనకు ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నాడు. అయితే వ్యక్తిగత ఆట తీరు బాగున్నప్పటికీ అది జట్టు విజయానికి కృషి చేసినప్పుడే సంతోషంగా ఉంటుందని బుమ్రా చెప్పాడు. అందుకే వ్యక్తిగత ప్రదర్శనల కన్న జట్టును గెలిపించడమే తన ధ్యేయమని ఈ పేస్‌గన్ వెల్లడించాడు.
కాగా కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన ఆరంభ వికెట్లతోపాటు భాగస్వామ్యాలు విడదీశాడు. మొత్తంగా 42 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను 210 పరుగులకే ఆలౌట్ చేయండంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాపై టీమిండియాకు 13 పరుగుల స్వల్ప అధిక్యం లభించింది. మిగతా బౌలర్లలో ఉమేష్, షమీ రెండేసి, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశారు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది.
క్రీజులో కెప్టెన్ కోహ్లీ, పుజారా ఉన్నారు. పుజారా 9 పరుగులతో, కోహ్లీ 14 పరుగులతో ఉన్నారు. అంతకు ముందు ఓపెనర్లు మరోసారి నిరాశపరిచారు. రాహుల్ 10, మయాంక్ 7 పరుగులు మాత్రమే చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికాపై భారత జట్టు 70 పరుగుల అధిక్యంలో ఉంది.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ కోహ్లీ 79 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో పుజారా 43, పంత్ 27, మయాంక్ 15, రాహుల్ 12, ఠాకూర్ 12, రహానే 9, షమీ 7, ఉమేష్ 4, అశ్విన్ 2 పరుగులు చేశారు. కాగా ఇప్పటికే ముగిసిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌లను ఇరు జట్లు చెరోటి గెలవడంతో ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది.