
టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా తన పెళ్లి రోజు సందర్భంగా తన భార్య సంజనా గణేషన్‌ను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్టు చేశాడు. మనిద్దరం కలిసి ఉంటే జీవితం బాగుంటుందని, నిజంగా చెప్పడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదని రాసుకొచ్చాడు. తన వెంట భార్య సంజనా గణేషన్ ఉంటే తన జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన భార్య తనను దయాహృదయం గల వ్యక్తిగా, శాంత స్వభావుడిగా, హస్యాస్పద వ్యక్తిగా మార్చేసిందని ఆ పోస్ట్‌లో బుమ్రా తెలిపాడు. తమ వివాహ బంధంలో సంవత్సర కాలం అనేది చాలా చిన్నది అని, ఏ కాస్త సమయం దొరికినా, తన భార్యతో గడపాలని కోరుకుంటానని తనలోని భావాలను వ్యక్తపరిచాడు. ఇక తామిద్దరం కలిసి తమ జీవితాన్ని అర్ధవంతంగా మార్చుకున్నామని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. అలాగే భార్యకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెబుతూ.. ఐ లవ్ యూ అంటూ రాసుకొచ్చాడు. అలాగే తమ పెళ్లి నాటి వీడియోను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం బుమ్రా, సంజనల వివాహానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా జస్ప్రీత్ బుమ్రా సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున పెద్దల సమక్షంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను వివాహమాడాడు. అయితే వీరిద్దరు తమ ఈ పెళ్లి రోజున దురదృష్టవశాత్తూ ఒకే దగ్గర లేక పోవడం గమనార్హం. 28 ఏళ్ల బుమ్రా ప్రస్తుతం శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగించుకుని ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇక సంజన విషయానికొస్తే ఆమె న్యూజిలాండ్‌లో ఉంది. అక్కడ జరుగుతున్న ఉమెన్స్ వన్డే ప్రపంచకప్‌నకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.
ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా బెంగళూరు వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 3 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 8 వికెట్లు తీశాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా 3 వికెట్లు తీశాడు. ఇలా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో ఇప్పటివరకు 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 21 సగటుతో 123 వికెట్లు తీశాడు. ఇక 70 వన్డే మ్యాచ్‌ల్లో 113 వికెట్లు, 57 టీ20 మ్యాచ్‌ల్లో 67 వికెట్లు తీశాడు.